31 August, 2026 | 1:10 AM

సర్రేకు ఆడనున్న ఆకిబ్ నబీ

31-08-2026 12:00 AM
  1. కౌంటీ క్రికెట్ బరిలో కశ్మీర్ పేసర్
  2. కివీస్ టూర్‌కు ముందు ప్రాక్టీస్
  3.   3 మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం

ముంబై, ఆగస్టు 30: న్యూజిలాండ్(New Zealand) పర్యటనకు ముందు భారత పేసర్ ఆకిబ్ నబీ కౌంటీ(Aqib Nabi County) క్రికెట్ ఆడబోతున్నాడు. కౌంటీ జట్టు సర్రేకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. ఈ మేరకు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు ఒప్పందం కుదిరింది. బీసీసీఐ ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైంది. సెప్టెంబర్ 2 నుంచి యార్క్ షైర్‌తో జరిగే మ్యాచ్ ద్వా రా ఆయన కౌంటీల్లో అడుగుపెట్టనున్నాడు. ఇటీవల శ్రీలంక సిరీస్‌కు ఆకిబ్ ఎంపికైనప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు.

కాగా భా రత జట్టు రాబోయే న్యూజిలాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆకిబ్‌ను కౌంటీలకు పంపాలని నిర్ణయించింది. న్యూ జిలాండ్ పిచ్‌లు బౌన్స్, పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అక్కడి కండీషన్స్‌కు తగ్గట్టు సిద్ధం చేసేందుకు నబీని ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిస్తోంది. ఇంగ్లండ్ గడ్డపై డ్యూక్ బాల్‌తో సాధన నబీకి ఎంతగానో ఉపయోగపడనుంది.

అకిబ్ నబీ ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. గత కొంత కాలంగా రెడ్ బాల్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025 సీజన్‌ల్లో 12.57 సగటుతో 60 వికెట్లు పడగొట్టాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ తొలి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర.

అయినప్పటికి అతడికి ఇంకా టీమిండియా తరపున అరంగేట్రం చేసే అవకాశం లభించలేదు. ఇదిలా ఉంటే ఈ మూడు కౌంటీ మ్యాచ్‌లు ముగిసిన వెంటనే సెప్టెంబర్ మూడో వారంలో నబీ స్వదేశానికి తిరిగి వస్తాడు. సెప్టెంబర్ 22 నుండి పుదుచ్చేరిలో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరగబోయే 4 రోజుల మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు పాల్గొంటాడు.