15 ఏళ్లకే కెప్టెన్సీ
- చరిత్ర సృష్టించిన వైభవ్
- దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత
- ఇషాన్ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు
బెంగళూరు, ఆగస్టు 30 : 14 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్(International Cricket)లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. 15 ఏళ్లకే దేశవాళీ క్రికెట్‌లో కెప్టెన్సీ(captaincy) బాధ్యతలు అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy) 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఈస్ట్ జోన్ జట్టు కు వైభవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అయితే సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) వికెట్ కీపింగ్ చేస్తూ అకస్మాత్తుగా గాయపడి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీనితో వైస్ కెపెన్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. వైభవ్ నాయకత్వం వహించిన ఈ జట్టులో మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
దేశవాళీ క్రికెట్ హిస్టరీలోనే కేవలం 15 ఏళ్ల వయసున్న ఆటగాడు ఒక ఫస్ట్-క్లాస్ జట్టుకు కెప్టెన్సీ వహించడం ఇదే తొలిసారి. వైభవ్ కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేయడమే కాకుండా, ఇటీవల భారత టీ20 జట్టు తరఫున అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కేవలం తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత వైభవ్ సూర్యవంశి తన దేశీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక నిర్ణయాలతో క్రికెట్ దిగ్గజాలను కూడా ఆకట్టుకు న్నాడు. కెప్టెన్సీలో మొదటి రివ్యూను తీసుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా సరైనదని రుజు వైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయ ల్ ఆడేందుకు ప్రయత్నించగా.. క్యాచ్ ఔట్ కోసం ముఖేష్ కుమార్ అప్పీల్ చేశాడు. అయితే ఆన్-ఫీల్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా గమనించి, పూర్తి విశ్వాసంతో వెంటనే డీఆర్‌ఎస్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు కదలికలు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తిరగరాసి ఆర్యన్ జుయల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ 266 పరుగులకు ఆలౌట్ అయింది.






