జలమండలి GM నివాసంలో ఏసీబీ సోదాలు.. కుమార్ ఆస్తులు @100 కోట్లు
హైదరాబాద్ జలమండలి జిఎం కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు
భారీ ఎత్తున డబ్బు లగ్జరీ ప్లాట్లు గుర్తింపు
ఉప్పల్ మే 19విజయక్రాంతి : హైదరాబాద్ జలమండలి హైదరాబాద్ మెట్రో పారిటన్ వాటర్ సప్లై అండ్ సివేరేజ్ బోర్డ్ రెడ్‌హిల్స్ జనరల్ మేనేజర్ (జిమ్ ) కుమార్ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ మల్లాపూర్‌లోని కుమార్ ప్రధాన నివాసంతో పాటు నగరంలోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
జలమండలిలో కీలక స్థానంలో ఉన్న అధికారిపై ఈ స్థాయిలో దాడులు జరగడం నగరంలో తీవ్ర సంచలనంగా మారింది.ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు మొత్తం 8 ప్రాంతాలలో ఈ తనిఖీలను విస్తృతంగా చేపట్టాయి. ఈ సోదాల్లో కుమార్ ఇంట్లో కట్టలకొద్దీ దాచిన సుమారు రూ.1.1 కోట్ల నగదు, దాదాపు 1 కిలో బంగారు ఆభరణాలు, పెద్ద ఎత్తున వెండి వస్తువులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడుతున్న వివరాలు అధికారులనే షాక్‌కు గురిచేస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం జీఎం కుమార్‌కు దాదాపు రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు..






