మీసేవా కేంద్రాలపై ఏసీబీ సోదాలు
హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
సికింద్రాబాద్/సూర్యాపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): అల్వాల్, అంబర్ పేట, మీసేవా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదా లు నిర్వహించారు.పౌర సేవల పత్రాల జారీ కి దళారుల ద్వారా మీసేవా సిబ్బంది అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
అంబర్ పేట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీ సేవ కేంద్రంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలలో అధికారులు ఆదేశాల మేరకు సోదాలు చేస్తున్నామని ఏసీబీ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మీసేవా కేంద్ర సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగ అధికారులతో ఉన్న సంబంధాలపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.
మీసేవ కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ల ఫోన్లు, కంప్యూటర్లు, వినియోగదారుల అప్లికేషన్ ఫామ్‌లను తనిఖీలు చేస్తున్నామని, ఏవైనా అవకతవకలు ఉంటే పై అధికారులకు రిపోర్ట్ చేస్తామని పేర్కొన్నారు. అంబర్ పేట మీ సేవ కేంద్రం యజమాని జయంతిని ప్రత్యేకంగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. సూర్యాపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శ్రీ సాయి వాసవి మీ సేవా కేంద్రంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పౌర సేవల పత్రాల జారీకి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాలలో అధికారులు ఆదేశాల మేరకు సోదాలు చేపడుతున్నట్టు నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. ఈ సోదాలలో భాగంగా మీ కేంద్రంలోని కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్లు, కంప్యూటర్లు, వినియోగదారుల దరఖాస్తు ఫామ్‌లను పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నామని, ఏవైనా అవకతవకలుంటే పై అధికారులకు నివేదిక పంపుతామన్నారు. రాత్రి 11 గంటలైనా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిర్వాహకుడితో పలు విషయాలపై ఆరా తీశారు.






