19-11-2025 02:15:23 PM
హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోని ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. భవన నిర్మాణాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు వరసగా సోదాలు చేపడుతున్నారు. దీంతో అవినీతి అధికారుల్లో కలవరం మొదలైంది. గతంలో ఆర్టీఏ కార్యాలయంలో, ఈనెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, 18న విద్యాశాఖ ఆఫీసులో అధికారులు తనిఖీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో లంచాలకు పాల్పడుతున్న అధికారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.