అర్హు లైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు
- జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ
- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులతో చర్చలు సఫలం
కామారెడ్డి, జూన్ 24 (విజయక్రాంతి): జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జర్నలిస్టు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (ౄPRO) నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
కలెక్టర్ దృష్టికి డీపీఆర్‌ఓ సమస్యలు
డిపిఆర్వో వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను జర్నలిస్టులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఆమోదం పొందిన 273 అక్రిడిటేషన్ కార్డులలో కొన్నింటిని మాత్రమే పంపిణీ చేసి, మిగతా కార్డుల జారీకి డిపిఆర్వో లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వివరించారు. బస్ పాసుల విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, జర్నలిస్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు డిపిఆర్వోను తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని, లేదా సంబంధిత శాఖకు సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందుతాయని హామీ ఇచ్చారు. అలాగే డిపిఆర్వో వైఖరిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియను పర్యవేక్షించి, వెంటనే కార్డులు జారీ చేయాల్సిందిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరిని కలెక్టర్ ఆదేశించారు.
అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో చర్చించి, అర్హులైన వారందరికీ త్వరితగతిన కార్డులు అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. టి యు డబ్ల్యూ జె (ఐ జే యు) జిల్లా అధ్యక్షుడు వి. రజినీకాంత్, కార్యదర్శి తోట రాజేష్, సంయుక్త కార్యదర్శి మోసర్ల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ముదాం వెంకన్న, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్, కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు, ముదాం శంకర్ పటేల్, కార్యదర్శులు, ఈసీ సభ్యులు ఇంజమూరు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.






