11 June, 2026 | 3:11 AM

అర్హులకు అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

11-06-2026 01:56 AM

ఇవ్వకుంటే పోరాటం తప్పదు 

టీయూడబ్ల్యూజే తీర్మానం

సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లాలో మిగిలిన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే-ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. బుధవారం సంగారెడ్డిలో యూనియన్ జిల్లా కార్యవర్గ అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగింది.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సిద్ధన్న పాటిల్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇంటి స్థలాల సమస్యపై, హెల్త్ కార్డుల అంశంపై చర్చించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం కేటాయించాలని తీర్మానించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా హెల్త్ కార్డును ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జీవో నెంబర్ 252 ప్రకారం ఆక్రిడిటేషన్ కార్డుల జారీలో చాలా ఆలస్యం అవుతుందని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. అయినప్ప టికీ తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వి రాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ అహ్మద్ ఆధ్వర్యంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ నివాస్ రెడ్డిని కలిసి అనేకసార్లు విన్నవించడం జరిగిందని చెప్పారు. దీని ఫలితంగానే అనేక సవరణలు వచ్చాయని, దానివల్లనే చాలామందికి అక్రిడేషన్ కార్డులు జారీ అయ్యాయని వివరించారు. మిగిలిన వారికి కూడా ఎలాంటి కొర్రీలు వేయకుండా తక్షణ మే కార్డు మంజూరు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులో జిల్లా మహాసభ నిర్వహించి కమిటీని ఎన్నుకుంటామని  ఫైజల్ తెలిపారు.