జాప్యం లేకుండా అక్రిడేషన్ల జారీ ప్రక్రియను పూర్తి చేయండి
• ఖమ్మం కలెక్టర్ టి.ఎస్. దివాకరకు డబ్ల్యూజేఐ విజ్ఞప్తి
• కొంత ఆలస్యమైనా అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ
ఖమ్మం,(విజయక్రాంతి): కొత్త అక్రిడేషన్ల జారీ ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) ఖమ్మం జిల్లా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకరను కోరారు. మంగళవారం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో కలెక్టర్ ను కలిసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్ రావు), జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కోకన్వీనర్లు ఎం.ఏ అన్సార్ పాషా, అమరనేని రామకృష్ణ, ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబ రావు,
ఏనిగండ్ల శ్రీనివాస రావు తదితరులు గత కొన్నేళ్లుగా కొత్త అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులు నిరాశ చెందకుండా కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు.డబ్ల్యూజేఐ ప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన కలెక్టర్ టి.ఎస్. దివాకర, రెండు రోజులు ఆలస్యమైనా ప్రశాంతంగా అక్రిడేషన్ల జారీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.






