18-01-2026 07:06:58 PM
బోడుప్పల్లో 361వ వారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు జ్ఞానమాల
మేడిపల్లి,(విజయక్రాంతి): అంబేద్కర్ ను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకూడదని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మేడ్చల్ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సృజన అన్నారు. బోడుప్పల్ సర్కిల్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 361వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని పూలమాలవేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే భారతీయులందరికీ స్వేచ్ఛ, సమానత్వంతో ఓటు హక్కు హక్కుతోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని, ఆయన త్యాగ ఫలితంగానే నేడు మహిళలు అన్ని రంగాలలో మగవారితో సమానంగా రాణిస్తున్నారని, ఇలాంటి తరుణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఒక వర్గానికో, ఒక కులానికో చెందిన వ్యక్తిగా చూడడం మానుకోవాలని, ప్రతి భారతీయుడికి అంబేద్కర్ ఆరాధ్యుడని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒకరి బాధ్యత అని ఆమె అన్నారు.
అనంతరం నత్తి మైసయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితంగా ఉద్యోగాలు పదవులు, అనుభవిస్తు కూడా కొందరు అంబేద్కర్ ను ఒక కులానికి పరిమితం చేయడం సిగ్గుచేటని, అంబేద్కర్ కొందరి వాడు కాదని అందరివాడు అని నత్తి మైసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, రఘు రూపుల మల్లేష్, బండారి సాయి, జై భీమ్ అజయ్, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.