04-05-2025 12:55:05 AM
* ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఒక చివరకు విసిరేసినట్లుండే కుగ్రామం అకోలి. పెన్‌గంగ పరీవాహకంలో ప్రకృతి రమణీయత మధ్య ఉంటుందీ గూడెం. పేరుకు గూడెమే అయినా.. దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదేంటో తెలుసా? గూడెం నుంచి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది యువతీ యువకులు వైద్యులుగా ఎదిగారు.
వేర్వేరు ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. వ్యవసాయమే జీవనాధార మైనప్పటికీ గ్రామస్థులు తమ పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనడానికి ఇదొక నిదర్శనం. తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని గుర్తించి శ్రద్ధగా చదువుకొని వైద్యులుగా ఎదిగిన తీరు భవిష్యత్ తరాలకూ ఆదర్శం.
ఆదిలాబాద్, మే 3 (విజయక్రాంతి): నిన్న మొన్నటివరకు జైనాథ్ మండలంలో అంతర్భాగమైన అకోలి గ్రామం తాజాగా మూడు కొత్త మండలాల ఏర్పాటుతో భోరజ్ మం డల పరిధిలోకి చేరింది. పెన్‌గంగ నదీ తీరం లో ఉంటుందీ గ్రామం. వ్యవసాయంపై ఆధారపడే ఇక్కడి ప్రజలు తమ కుటుంబాలను పోషించుకుంటారు. గ్రామంలో దాదా పు 500 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామం లో మౌలిక వసతుల కల్పన అంతంతమాత్రమే.
ఈ మధ్యనే గ్రామస్తులు రహదారి సౌకర్యానికి నోచుకున్నారు. గ్రామానికి ప్రతిరోజూ ఆర్టీసీ బస్సు రెండు ట్రిప్పులు నడు స్తుంది. గ్రామంలో ఒకే ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఆపై చదువుల కోసం విద్యార్థు లు ఊరు విడిచి వెళ్లాల్సిందే. అలా ఆకోలిలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థు లు గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ని గిమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సిందే.
ఒకప్పుడు కనీసం రోడ్డు సౌక ర్యం కూడా లేని ఈ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు ఇక్కడి విద్యార్థులు. తాము కష్టపడ్డా ఫర్వాలేదు కానీ తమ పిల్లలను ప్రయోజకులను చేయాలన్న సంకల్పంతో గ్రామస్థులు తమ పిల్లల ను చదువుల్లో ప్రోత్సహించారు. ఇక్కడి విద్యార్థులు చదివిందంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే అయినా ఉన్నత ఉద్యో గాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వైద్యులుగా కొనసాగుతున్నారు.
గ్రామ విశేషం ఏమిటంటే..
అసలు ఈ గ్రామం విశేషం ఏమిటంటే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19 మంది వైద్యులు ఉన్నారు. ఇంకా కొందరు వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైద్యరంగంలో ఉన్నత ఉద్యోగాలను చేపట్టారు. మరికొందరు వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వైద్యుడు డా.బాపురావు పేదల డాక్టర్‌గా ఈ ప్రాంతంలో పేర్గాంచారు.నామమాత్రం ఫీజు తీసుకొని నిరుపేదలు, గిరిజనులకు వైద్యసేవలు అందించారు.
ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని తర్వాతి తరం వారు సైతం వైద్యవిద్యను అభ్యసించి వైద్యులుగా మారారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ సురేశ్ పశువైద్యాధికారిగా పనిచేస్తుండగా ఆయన తనయుడు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్ గజానన్ మండల వైద్యాధికారిగా సేవలను అందించి, ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లోని జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆ వైద్యులకు సత్కారం..
ఈ గ్రామం నుంచి ఎక్కువ మొత్తంలో వైద్యవృత్తిలో ఉంటే మరికొందరు విద్యా, రెవెన్యూ, తదితర శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇటీవల అకోలికి చెందిన విశ్రాంత తహసీల్దార్ నర్సింలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఈ గ్రామానికి చెందిన 19 మంది వైద్యులను, వారి తల్లిదండ్రులను సత్కరించడం విశేషం.
గ్రామంలో సౌకర్యాలు లేకున్నా కష్టపడ్డాం
మా గ్రామం నుంచి ఎంతో మంది వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. గ్రామంలో సౌకర్యాలు లేకున్నా పట్టుదలతో రాణించాం. సౌకర్యాల లేమి, పేదరికం ఇవేమీ మా చదువుకు అడ్డు రాలేదు. నేను చదువుకున్నదంతా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే. గ్రామానికి ౫ కిలోమీటర్ల దూరంలో ఉన్న గిమ్మా గ్రామ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకున్నాం. మా ఊర్లో చాలా మంది వ్యవసాయం పైనే జీవనం సాగిస్తారు. ఆర్థిక స్థోమత అంతగా లేకున్నా పట్టుదలతో చదివి వైద్య వృత్తిలోకి వచ్చా.
డాక్టర్ గజానన్,
రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్
సీనియర్ల స్ఫూర్తితో వైద్య వృత్తిలోకి..
మా గ్రామం నుంచి డాక్టర్లుగా కొనసాగుతున్న సీనియర్లను స్ఫూర్తిగా తీసుకొని నేను వైద్య వృత్తిలోకి వచ్చా. మా మేనమామ వెటర్నరీ డాక్టర్. అదేవిధంగా మా కజిన్ బ్రద ర్ సైతం డాక్టరే. అందుకే నేను కూడా డాక్టర్ కావాలని కష్టపడి చదివాను. నేను డాక్టర్ కావడానికి ముఖ్యంగా కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది. మా ఊరు నుంచి తొలి డాక్టర్‌గా బాపూరావు పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది వైద్య వృత్తి వైపు అడుగులు వేస్తున్నారు.
డాక్టర్ వినోద్ మునిగెల
ఈఎస్‌ఐ ఆసుపత్రి, హైదరాబాద్
మా గ్రామస్థులందరికీ గర్వకారణం
మా ఊరు అకోలి నుంచి 19 మంది డాక్టర్లు కావడం గ్రామానికే గర్వకారణం. ఇందుకు గ్రామస్థులందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు ఈ స్థాయికి ఎదిగారు. అంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే కుటుంబాలు. కానీ పిల్లలను మాత్రం కష్టపడి చదివించారు.
అదేవిధంగా ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో ఉన్నవారు విద్యార్థులకు మరింతగా ప్రోత్సాహిస్తున్నారు. మొన్నటివరకు మా గ్రామంలో సౌకర్య లు లేకున్నా 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గిమ్మా గ్రామానికి వెళ్లి చదువుకున్నారు.
కుంచెట్టి కేశవ్,
తాజా మాజీ సర్పంచ్