రోడ్డు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
మేడ్చల్, ఆగస్టు 18 (విజయక్రాంతి): జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని మోహన్ రావు కాలనీ పేస్ 2 లో వీఆర్వో కార్యాలయం సమీపంలో రోడ్డును కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. కలెక్టరేట్ సమీపంలోని జిల్లా ప్రెస్ క్లబ్బులో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొంతమంది రోడ్డు స్థలాన్ని తమ ప్లాటుగా చెబుతూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు.
అనేక ఏళ్లుగా ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నామని ప్రస్తుతం కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అంబులెన్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని, ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోందని వారు పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో, మున్సిపల్ కార్యాలయంలో, రెవెన్యూ కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. రోడ్డును కబ్జా నుంచి విముక్తి కల్పించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.






