16 August, 2026 | 9:07 PM

ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

16-08-2026 08:27 PM

- హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అమ్ముడుపోయారు

- హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి 

- సాహెబ్ నగర్ డివిజన్ లోని బృందావన్ మేడోస్ కాలనీవాసుల ఆందోళన 

ఎల్బీనగర్, ఆగస్టు 16: పేదలు కొనుగోలు చేసిన ప్లాట్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సాహెబ్ నగర్ డివిజన్ లోని బృందావన్ మేడోస్ కాలనీవాసులు ఆదివారం ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... బృందావన్ మేడోస్ కాలనీలో సామిడి రామిరెడ్డి ఇతరులు సర్వే నెంబర్ 130లో ఉన్న 7.24 ఎకరాల్లో 1979లో మొత్తం 122 ప్లాట్లుగా చేసి విక్రయించారన్నారు. ఆయా లే అవుట్ ప్లాట్లకు జీహెచ్ఎంసీ నుంచి 1989లో ఇంటి నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చారని తెలిపారు. అయితే, 2013లో భీంరెడ్డి సుగుణ అనే మహిళ నకిలీ పత్రాలు సృష్టించి, 1.24 ఎకరాల భూమిని తనదేనని ఆక్రమించినట్లు ఆరోపించారు.

1.24 ఎకరం భూమిలో సామిడి రామిరెడ్డి విక్రయించిన 35 ప్లాట్ల యజమానులు ఇప్పుడు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ రికార్డులు పరిశీలించగా భీంరెడ్డి సుగుణ 1946లో నారాయణగూడకు చెందిన వీణారాణి అనే మహిళ నుంచి 1.24 ఎకరాల భూమిని కొన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. 35 ప్లాట్ల యజమానులు తమకు న్యాయం చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ హయత్ నగర్ ‌సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సర్కిల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం భీంరెడ్డి సుగుణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు.‌ అక్రమంగా ఆక్రమించిన భూమిలో సుమారు 600 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా సుగుణ అనే మహిళ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని తెలిపారు.

అసలైన హక్కుదారులకు న్యాయం చేయాల్సిన ఎల్బీనగర్ జోనల్ మున్సిపల్ అధికారులు అమ్మడుపోయారని సామ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఫ్లాట్ల యజమానులు కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు మంతురు దత్తారెడ్డి, రాహుల్ రెడ్డి, వేణుగోపాల్, సామ వెంకట్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, ఎంసీ మోహన్, బృందావన్ మేడోస్ కాలనీ అధ్యక్షుడు శశి తదితరులు పాల్గొన్నారు.