అవినీతి అధికారులపై చర్యలు తీసుకొవాలి
నాన్ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి) : అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని(ముజీబ్), జిల్లా కార్యదర్శి విక్రమ్‌కుమార్ శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ.. 2021లో పౌర సరఫరాల శాఖలో పనిచేసిన కొందరు అధికారులు జిల్లా కార్యదర్శి అధికారిక లాగిన్ ద్వారా అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ విషయంపై ఫిర్యాదు చేసి మూడు సంవత్సారాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని, అవినీతికి పాల్పడ్డ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పైగా కొందరు పైస్థాయి అధికారులు వారిని కాపాడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషనర్ వెంటనే ప్రధాన రేషనింగ్ అధికారికి ఫోన్ చేసి త్వరగా నివేదిక పంపించాలని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే అవినీతి అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.






