12 August, 2026 | 1:33 AM

గ్రేటర్‌లో తగ్గిన ఆర్టీసీ బస్సులు!

25-05-2024 02:00 AM

సమయానికి బస్సులు రాక ప్రయాణికుల అవస్థలు

పాడైపోయిన వెయ్యి బస్సుల స్థానంలో రీప్లేస్‌మెంట్ లేదు 

475 ఈవీ బస్సుల కోసం వెయిటింగ్  

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుముఖం పట్టిం దా? గతంతో పోల్చితే ప్రస్తుతం బస్సుల సంఖ్య తగ్గిందా? బస్సులు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోయాయా? అంటే నగర ప్రజల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సుల కొరత ఉన్నట్టుగా అధి కారులు బహిరంగంగా ప్రకటించకున్నా.. ఆర్టీసీ మాత్రం అనధికారికంగా బస్సుల సం ఖ్య తగ్గిస్తోంది.

ఇంతకు ముందు 10 నిమిషాల వ్యవధిలోనే బస్సుల కోసం వెయిట్ చేసే ప్రయాణికులు ప్రస్తుతం అర్థ గంట నుంచి గంట వరకు వెయిట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. 15 ఏళ్లకు పైగా పైబడిన, 12 లక్షల కిలో మీటర్లకు పైగా తిరిగిన బస్సులను పక్కన పడేసి, ఆ స్థానంలో రీప్లే స్‌మెంట్ చేయకపోవడం కారణంగానే బస్సులు కొరత ఉన్నట్టుగా తెలుస్తుంది. గ్రేటర్‌లో బస్సుల కొరతను తీర్చి ఇబ్బందులను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

వెయ్యికి పైగా తగ్గిన బస్సులు

గ్రేటర్‌లో నాలుగేళ్ల క్రితం 3800 బస్సులు ఉండేవి. క్రమేపీ ఈ బస్సుల సంఖ్య 2842 కు పడిపోయాయి. కానీ, గతం కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మీ పథకం అమలు చేస్తుంది. దీంతో ప్రయాణికులు 40 శాతం పెరిగారు. ఫలితంగా నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యాలయాలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు రద్దీ విపరీతంగా ఉంటుంది.

ఇదే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లతో రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. దీంతో ప్రయాణికులు కార్యాలయాలకు సరైన సమయానికి చేరుకో లేకపోతున్నారు. గ్రేటర్‌లో గతంలో మాదిరిగానే 3500 బస్సులను నడిపించాలనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. అయితే, బస్సులను సమకూర్చడం, మంజూరైన బస్సులను అందుబాటులోకి తీసుకు రావడం అనే విషయం అధికారుల పరిధిలో లేకపోవడం వల్ల ఈ విషయంలో అధికారులు సైతం మౌనం పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవం ఇలా ఉంటే.. ఉన్నతాధికారుల ఒత్తడి కారణంగా బస్సులు సరిపడా ఉన్నట్టుగానే అధికారులు చెబుతుండటం విశేషం. 

రీప్లేస్‌మెంట కోసం వెయిటింగ్

నాలుగేళ్ల క్రితం ఆర్టీసీలో జరిగిన 50 రోజుల సమ్మె కారణంగా దాదాపు వెయ్యి బస్సులకు పైగా నడపడానికి వీల్లేకుండా పోయా యి. అప్పటికే 15 ఏళ్లకు మించిన వాహనాలను వినియోగిస్తున్న ఆర్టీసీకి.. ఒకేసారి 50 రోజులు కదల కుండా ఉన్న బస్సులు అసలే పనికిరాకుండా పోయాయి. అప్పటి నుం చే క్రమంగా సిటీలో ఆర్టీసీ బస్సులు తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తున్నది. వీటి స్థానంలో కొత్త బస్సు లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నా.. ఆర్టీసీ మాత్రం ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతుం ది.

పాడైపోయిన బస్సుల స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచించినా ఇప్పటి వరకు కేవలం 25 బస్సులు మాత్రమే అందుబాటులోకి వచ్చా యి. ఇంకా 475 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉంది. వీటికోసం నెలల తరబడి వెయిట్ చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతుంది. ఇవే కాక, మరో 125 బస్సులు అదనంగా రావాల్సి ఉంది. ఈ 600 బస్సులు అందుబాటులోకి వస్తే గ్రేటర్ ప్రయాణికులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. 

బస్సులు తగ్గడంతో సీట్లు దొరకడం లేదు

నగరంలో ఆర్టీసీ బస్సులు చాలా తగ్గాయి. బస్సులు తగ్గడం వల్ల సమయానికి బస్టాప్‌ల వద్దకు రావడం లేదు. వచ్చినా, బాగా రద్దీ ఉంటుంది. ఎక్కువ శాతం నిల్చొనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. మెట్ల వరకూ నిల్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మాత్రమే సీట్లు దొరుకుతున్నాయి. రాంనగర్ నుంచి మెహిదీపట్నం రూట్‌లో 6ఆర్ బస్సులు, 86, 113 నంబర్ బస్సులు చాలా తగ్గాయి. ఈ బస్సుల కోసం అరగంటకు పైగానే బస్టాపులో ఎదురు చూడాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను గమనించి తక్షణమే బస్సులను పెంచాలని కోరుతున్నాం.  

వి. ప్రగతి, రాంనగర్