3 April, 2026 | 4:11 AM

స్వేచ్ఛకు ‘హేట్ స్పీచ్’ సంకెళ్లు!

03-04-2026 01:45 AM
  • తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన న్యాయవాదులే
  • దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి
  • మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్‌రెడ్డి హేట్ బిల్లు తీసుకొచ్చారు
  • ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కును కాపాడాల్సిన బాధ్యత యువ లాయర్లపై ఉన్నది
  • యువత రాజకీయాల్లోకి రావాలి.. దేశానికి ఒక కొత్త మార్గదర్శకం కావాలి
  • మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్‌రెడ్డి హేట్ స్పీచ్ బిల్లును తీసుకొచ్చారని, అది ఫ్రీజ్ స్పీచ్ బిల్లు అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగం లో ఉన్నారని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేడ్కర్ రూపంలో స్వాతంత్య్ర పోరాటంలో ముందున్నది న్యాయవాదులే అని గుర్తు చేశారు.

సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే అని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన ‘డ్యూసి మస్ లీడ్’ ముగింపు కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయని చెప్పారు. యువత అంటే సాఫ్ట్ వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే సంథిం గ్ స్పెషల్ అని ప్రశంసించారు.

ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ న్యాయవాదులు ఉంటారని, ఎక్కడ న్యాయవాదులు ఉంటారో ఆ పోరాటం గమ్యాన్ని చేరుతుంది, విజయం సిద్ధిస్తుందన్నారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికీ ఈ దేశంలో పేదవాడికి న్యాయం అందడం లేదు. న్యాయం దక్కని పీడితుల పక్షాన గొంతై నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు పోరాటాలను అణిచివేయాలని చూస్తాయని, అలాంటి సమయంలో మీరు సమాజానికి అండగా నిలబడాలని సూచించారు. మాట్లాడే స్వేచ్ఛను హరించడానికే రేవంత్‌రెడ్డి హేట్ స్పీచ్ బిల్లును తీసుకొచ్చారని, అది ఫ్రీజ్ స్పీచ్ బిల్లు అని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే కేసు, వేలు ఎత్తి ప్రభుత్వ తప్పిదాన్ని చూపిస్తే కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ చేస్తే శాసన సభ్యులంతా వ్యతిరేకిస్తే అది సెలెక్ట్ కమిటీకి పోయిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నాలుగు మూలస్తంభాల్లో న్యాయవ్యవస్థ ముఖ్యమైనదని తెలిపారు. అంబేడ్కర్ దేశ ప్రజలకు కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కును కాపాడాల్సిన బాధ్యత యువ లాయర్లపై ఉన్నదని సూచించారు. ఠాకూర్ ఆడిటోరియానికి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ఉందని, వేణుగోపాల్‌రెడ్డి అనే తెలంగాణ బిడ్డ స్వరాష్ట్రం కోసం ఇక్కడే ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే ఎన్‌సీసీ గేట్ దగ్గర యాదయ్య అనే యువకుడు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కండ్ల ముందు కనిపిస్తుందన్నారు.