ఖాళీ ప్లాట్లలో చెత్త వేస్తే కఠిన చర్యలు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఖాళీ ప్లాట్లలో చెత్త వేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ఇకపై అలా చెత్త వేసిన వారిపై పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుని భారీ జరిమానాలు విధిస్తామని రాజంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ బుర్సా పోచయ్య హెచ్చరించారు. 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఓల్డ్ రాజంపేట, సాయి నివాడ గల్లీలలో పారిశుధ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ బుర్సా పోచయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గులాం జావిద్, కిషోర్, లావణ్య పాల్గొని స్థానిక ప్రజలకు పారిశుధ్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఖాళీ ప్రదేశాల్లో అడ్డగోలుగా చెత్త వేయడం వల్ల దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని, ప్రతి ఒక్కరూ చెత్తను పంచాయతీ ట్రాక్టర్లకే అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.




