14-05-2025 01:12:13 AM
వనపర్తి టౌన్, మే 13 ( విజయక్రాంతి ) : తమ వ్యక్తిగతమైన కారణాలవల్లగాని, కుటుంబ కలహాల వల్లగాని, ఇతరుల చేత బాధించబడినా,మరే కారణాల వల్లగాని బాధితులు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్ లో గాని, తమకు గాని వచ్చి ఫిర్యాదు చేయాలేగాని విధినిర్వహణలలో ఉన్న ప్రభుత్వ అధికారుల ముందు, ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నాలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా వారిపై కేసు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
మేనమామ, సోదరుడి నుండి ప్రాణహాని ఉందని, తనకు రావలసిన ఆస్తులను ఇప్పించాలని కోరుతూ పోలీసులకు సంబంధం లేని విషయంలో, బెదిరించే నెపంతో జంగాలగుట్టకు చెందిన శిరువాటి శంకర్ తన భార్య ముగ్గరు పిల్లలపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను జిల్లా పోలీస్ అధికారి ఉదహరిస్తూ పోలీస్ అధికారులకు సంబంధంలేని విషయంలో, జిల్లా పోలీసు కార్యాలయం ముందు న్యూసెన్స్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిసారు.
ఇక మీదట ప్రభుత్వ కార్యాలయాల ముందు, ప్రభుత్వ అధికారుల ముందు ఇలా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే ఆ సన్నివేశాన్ని వీడియో చిత్రీకరణ చేసి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించి తమ తమ న్యాయపరమైన సమస్యలను, ఫిర్యాదులను ప్రజలు పోలీసువారి వద్దకు నేరుగా వచ్చి న్యాయపరంగా, చట్టపరంగా పరిష్కరించుకోవాలి గాని అధికారులకు, వారి విధులకు ఆటంకం కలిగించవద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.