14-05-2025 01:15:39 AM
కరీంనగర్/మంథని, మే 13 (విజయక్రాంతి): త్రివేణి సంగమం కాళేశ్వరంలో నరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. మే 15న ప్రారంభం కానున్న ఈ పుష్కరాలు 12 రోజులపాటు జరగనున్నాయి. గత పుష్కరాలు ఉమ్మడి రాష్ట్రంలో జరగగా స్వరాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గం కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలు జరగనున్నాయి.
పుష్కరాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యేక వ్బుసైట్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో ప్రాశస్త్యం ఉన్న 12 నదులకు పుష్కరాలు జరగడం సాంప్రదాయంగా వస్తుంది. యేటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదులలో సరస్వతి నది కూడా ఉండటంతో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి.
త్రివేణి సంగమంలో..
ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదుల సంగమంతోపాటు అంతర్వాహిణిగా సరస్వతి నది కలుస్తుండటంతో ఈ ప్రాంతానికి త్రివేణి సంగమంగా కూడా పేరుంది. ఈ ప్రాంతాన్ని భక్తులు పవిత్రమైన సంగమంగా భావిస్తారు. కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నది, మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది రెండు నదులు సంగమించినచోట సరస్వతి అంతర్వాహిణి నది ఉద్భవిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
మే 15న గురు మదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. మే 17వ తేదీన తుని తప్పవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి పుష్కర స్నానం చేస్తారు. 23న హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పుష్కర స్నానం ఆచరిస్తారు.
సరస్వతి పుష్కరాలలో కాశీ నుంచి వచ్చే పురోహితులు హారతి, ప్రత్యేక హోమాలు చేస్తారు. భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గదుల వసతితోపాటు డార్మేటరి భవనాలను అందుబాటులోకి తెచ్చారు. భక్తుల సౌకర్యం కోసం టోల్ ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటుచేశారు.
ఈ పుష్కరాలకు రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. రోజుకు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగినట్టు ఏర్పాటు చేసింది.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
ఈ పుష్కరాల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రూ.30 కోట్ల నిధులు విడుదల చేశారు. భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీని ఏర్పాటు చేశాం. కాశీ నుంచి వచ్చే పురోహితులతోపాటు స్థానిక పురోహితులు కలిపి ప్రత్యేక హారతి, హోమాలు నిర్వహిచేలా సిద్ధం చేశాం. మంత్రి పొన్నం ప్రభాకర్ బస్షెల్టర్ నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాం. *దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడుపనున్నాం. కరీంనగర్ నుంచి 30 బస్సులు, గోదావరిఖని నుంచి 10 బస్సులు, మంథని నుంచి 10 బస్సులు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సులకు కూడా మహాలక్ష్మీ పథకం వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
బీ. రాజు, ఆర్టీసీ, రీజినల్ మేనేజర్, కరీంనగర్