14 July, 2026 | 4:52 AM

యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

14-07-2026 01:28 AM

ఏడీఏ శోభారాణి హెచ్చరిక

ఆమనగల్లు, జులై 13(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర కంటే యూరియాను ఎక్కువ ధరకు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని ఆమనగల్లు వ్యవసాయ సహాయ సంచాలకులు  శోభారాణి హెచ్చరించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన ఒక రైతు, ఆమనగల్లులోని ’నాగార్జున ఆగ్రో ఫర్టిలైజర్ & కెమికల్స్’ దుకాణంపై వ్యవసాయ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తను 30 బస్తాల యూరియాను బుక్ చేసుకోగా, సదరు డీలర్ కేవలం 15 బస్తాలు మాత్రమే సరఫరా చేశారని రైతు ఆరోపించారు. అంతేకాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన అధికారిక ధర రూ. 266.50 కి బదులుగా, ఒక్కో బస్తాకు రూ. 330 చొప్పున అక్రమంగా వసూలు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే దుకాణ యజమాని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మిగిలిన 15 బస్తాలను పట్టాదారు పాస్బుక్లో నమోదు చేయకపోవడంతో పంటకు ఎరువులు అందక ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు.ఆమనగల్లులోని పలువురు ఎరువుల డీలర్లు కూడా ఇదే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని, అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బాధిత రైతు హెచ్చరించారు.

రైతులకు ముఖ్య గమనిక

యూరియా (45 కేజీలు) అధికారిక ధర: రూ. 266.50 మాత్రమే. ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా e-PoS మిషన్ రసీదు (బిల్లు) అడిగి తీసుకోగలరు.ఎవరైనా డీలర్ అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0426 కు ఫిర్యాదు చేయవచ్చు.