11 May, 2026 | 11:17 AM

చెరువుల పునరుద్ధరణకు చర్యలు

22-06-2024 01:18 AM

ఆక్రమణలపై క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తం 920 చెరువులకు గాను 282 పూర్తిగా, మరో 209 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు టోపోషీట్  రిమోట్ సెన్సింగ్ అధికారులు స్పష్టం చేశా రు. ఆక్రమణలకు గురైన చెరువుల చిత్రపటాలను సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్ రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించినట్లుగా అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంట లపై తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టీజీఆర్‌ఏసీ) అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్ పరిధిలో ఆక్రమణలకు గురైన చెరువులపై రూపొందించిన నివేదికను డిప్యూటీ సీఎంకు అందజేశారు. కబ్జాదారులు చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఓఆర్‌ఆర్ దాకా చెరువులు, కుంటల ఆక్రమణలపై క్షేత్ర స్థాయిలో సమగ్రమైన సర్వే చేపట్టాలని, వీటిని పూర్వ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో టీజీఆర్‌ఏసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పీ మనోహర్, సైంటిఫిక్ ఆఫీసర్స్ డాక్టర్ ఎస్. బాలకృష్ణ, పీ ప్రకాష్, అశ్విని కుమార్ దాస్, ఏఓ ఆర్‌ఎన్ చారి తదితరులు పాల్గొన్నారు.