ఎరువులు ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరిక
- ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశం
- జూన్ 19నాటికి 17.50లక్షల ఎకరాల్లో పంటలు
- అత్యధికంగా 15,60,677 ఎకరాలు పత్తి,
- 76 వేల ఎకరాల్లో కంది సాగుబడి
- ఖరీఫ్ సీజన్‌పై మంత్రి సమీక్షలో అధికారులు వెల్లడి
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, పూర్తిగా ఈపిఓఎస్ ద్వారానే అమ్మకాలు జరిగేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం సాగు వివరాలు, ఎరువుల నిల్వలపై సమీక్ష నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు జరిపితే సదరు డీలర్లు, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా ప్రవేశ పెట్టిన పైవ్స్ ఆధారంగా వ్యవసాయాధికారులందరూ విధిగా తనిఖీలు చేసిన ఎప్పటికప్పుడు విక్రయాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.
వచ్చే ఆగస్టు మాసం వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రి నడ్డాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వానాకాలంలో పంటలు ప్రారంభమైతాయని దానికి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడ ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక చేసిందని, తదనుగుణంగా రాష్ట్ర కేటాయింపులు ప్రకారం ఆగస్టు నెలవరకు కేటాయించిన డిఏపి, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈసందర్భంగా వ్యవసాయ శాఖ ఉన్నతాధి కారులు మాట్లాడుతూ జూన్ 19 నాటికి 17.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయ్యాయని, ఇందులో అత్యధికంగా పత్తి 15,60,677 ఎకరాలు, కంది పంట 76 వేల ఎకరాలు సాగు చేసినట్లు తెలిపారు. రానున్న పక్షం రోజుల్లో వరి నార్లు పోసుకోవడం, దుక్కులు పూర్తి అయినందున్న ఆరుతడి పంటలు విత్తుకోవడం ఊపందుకుంటుందని చెప్పారు. ఎరువులు 10.40లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 2.40లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి, 10లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 60వేల మెట్రిక్ టన్నుల ఎంఓపి, లక్ష మెట్రిక్ టన్నులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
జూలై చివరి నాటికి 5.65లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.57లక్షల మెట్రిక్ టన్నుల డిఏపికి 1.47లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి, 1.30లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులకు 5.37 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపికి 0.26 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. వీటిలో 1.07లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.54 లక్షల మెట్రిక్ టన్నుల డిఏపి, 1.06లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని వెల్లడించారు.






