పర్యాటక భవన్‌లో జూపల్లి ఆకస్మిక తనిఖీ
ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో మంత్రి అసహనం
హాజరు, పనితీరుపై సమీక్షిస్తామని హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): హిమాయత్‌నగర్‌లోని పర్యాటక భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిసెప్షన్‌లో ఉన్న హాజరు పట్టిక, బయోమెట్రిక్‌లో అటెండెన్స్‌ను మంత్రి పరిశీలించారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లోర్‌ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు.
సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని, హాజరుశాతం, పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై మంత్రి జూపల్లి స్పందించారు. పాశవిక దాడిని ఖండించి విచారం వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి పాశవిక దాడులకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్సీ వైభవ్‌గైక్వాడ్‌కు ఫోన్ చేసి కేసు పురోగతిని ఆరా తీశారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మంత్రికి ఎస్పీ వివరించారు.






