26 March, 2026 | 3:40 AM

ఉచిత ఇసుక దుర్వినియోగం చేస్తే చర్యలు-

26-03-2026 01:04 AM

కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్/లింగాపూర్, మార్చి 25(విజయ క్రాంతి):  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అందించే ఉచిత ఇసుకను ఇతర పనులకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హరిత హెచ్చరించారు. కెరమెరి మండలంలోని అనార్పల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆపి రసీదులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ లోకేశ్వర్ రావు, జైనూర్, కెరమెరి తహసీల్దార్లకు సమాచారం ఇచ్చి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాజీ మావోయిస్టు కుటుంబానికి ఆదుకుంటాం

మాజీ మావోయిస్టు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హరిత తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఎస్పీ నితికా పంత్, ఐటిడిఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మత్, ఆర్డీఓ లోకేశ్వర్ రావుతో కలిసి సమీక్షించారు. సందీప్ నగర్కు చెందిన మాజీ మావోయిస్టు బోయిని నగేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం,

సాగు చేస్తున్న ప్రభుత్వ భూమికి పట్టా మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగేష్ భార్యను మహిళా సంఘంలో చేర్చి బ్యాంకు రుణం అందించడంతో పాటు అతని కుమార్తెకు పై చదువులు కొనసాగించేందుకు సహాయం అందిస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్డీఓ దత్తారావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు జితేందర్ పాల్గొన్నారు.

అలాగే జైనూర్‌లింగాపూర్ రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను జిల్లా కలెక్టర్ బుధవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వంతె న పూర్తయితే జైనూర్, లింగాపూర్ ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయని తెలిపారు.

వంతెనలపై పర్యవేక్షణ పెంచాలి

జిల్లాలోని లో లెవెల్ వంతెనల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కే. హరిత అధికారులకు సూచించారు. బుధవారం జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లో పర్యటించి వంతెనలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంచన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, గున్నూర్ అంగన్వాడీ కేంద్రం, మహాగాం ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ యు ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.