అదరహో ఆదివాసీల ఆచారం
ఆధునిక కాలంలోనూ ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు. ఆదివాసీలు ఏ పండుగ జరుపుకున్నా, ఏ వేడుక చేసుకున్నా ఎంతో నియమనిష్టలతో జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధించే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ ఖోడంగ్.
దీన్నే మారుగోళు లేదా గుర్రాల ఆట అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో ఈ ఖోడంగ్ వేడుకల సందడి నెలకొంది. చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు దాదాపు నెల రోజుల పాటు గిరిపల్లెల్లో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చూసేందుకు వింతగా కనిపించే ఈ ఆచారం వెనుక ఎంతో పరమార్ధం దాగి ఉంటుంది.
ఎలా జరువుకుంటారు..
ఈ ఖోడంగ్ పండుగకు ముందు ఆదివాసీ గిరిజనులు సమీప అటవీ ప్రాంతానికి వెళి వన దేవతలకు సంప్రదాయబద్దంగా పూజలు చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అటవీ ప్రాంతం నుండి వెదురు బొంగులను వెంట తీసుకువస్తారు. అలా తెచ్చిన వెదురు బొంగులతో మారుగోళ్లను తయారు చేస్తారు.
నిలువుగా పొడవుగా ఉన్న 2 వెదురు బొంగులపై నిటారుగా నిలబడేలా కొద్దిగా ఎత్తులో అడ్డంగా రెండు చిన్న వెదురు బొంగు ముక్కలను కట్టి తయారు చేస్తారు. వాటిపై కాళ్లు పెట్టి నిలబడి వాటి సహయంతో అటు ఇటు నడుస్తారు. మారుగోళ్ల పై నిలబడి బ్యాలెన్స్ తప్పకుండా చకచకా నడుస్తుంటే చూసేవారికి ఆశ్చర్యం కలుగకమానదు.
పండుగ వెనుక పరమార్థం
సాధారణంగా వర్షకాలంలో గిరిజన గూడాల్లో రోడ్లు చిత్తడిగా మారిపోతుంటా యి. వీధులన్నీ బురదమయం అవుతాయి. ఆ బురదలో నడవటం వల్ల అంటూ వ్యాధులు ప్రబలడం, కాలికి పుండ్లు అయ్యేవి. ఈ సమస్యను అధిగమించడానికి పూరీకులు ఇలా వెదురు బొంగులతో మారుగోళను తయారు చేసుకొని కాలికి బురద అంటకుండా వీటితో నడిచేవారు. ఇదే ఆచారాన్ని ఇక్కడి గిరిజనులు ఇప్పటికి కొనసాగిస్తున్నారు.
పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ మారుగోళ్లన్నింటిని ఊరి పొరిమేరలో ఏదైన ఆలయం వద్ద విడిచిపెట్టివస్తారు. అప్పటి వరకు ఈ ఆచారం కొనసాగుతుంటుంది. అయితే ఈ ఆటను ఎక్కువగా గూడాల్లో ఉండే పిల్లలు ఆడతారు. ప్రస్తుతం పిల్లలు చదువుల కోసం పట్టణాలకు వెళ్తుండటంతో ఈ ఆటలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. కేవలం ఆదివాసీలు మాత్రమే ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తూ కళను పరిరక్షిస్తున్నారు.
-ఆదిలాబాద్, విజయ క్రాంతి






