16 July, 2026 | 5:52 AM

అక్కడ ఆర్టిస్టు ఆట(డ)బొమ్మే

21-08-2024 02:30 AM

మాలీవుడ్ సినిమాలు తెరపై ఎంత అందంగా ఉంటాయో.. తెర వెనుక జరిగే వ్యవహారాలు అంతకంటే అసహ్యంగా ఉంటున్నాయి. అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్లంతా ఓ మాఫియా గా ఏర్పడి లేడీ ఆర్టిస్టులను ఆటబొమ్మలుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం మాలీవుడ్‌లో శరీరాలు అర్పించుకుంటే సినిమాల ఛాన్సులు అనే పరిస్థితి నెలకొంది. స్వయంగా కేరళ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 

మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. కారులో ఆమెపై లైంగిక దాడులు జరిపినట్లు నటుడు దిలీప్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతడు అరెస్టయ్యాడు. అదే సమయంలో మాలీవుడ్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ అనేక విషయాలను బయటపెట్టింది.

మలయాళ చిత్రసీమ మాఫియా చేతిలో కీలుబొమ్మగా మారిందని రిపోర్ట్‌లో తెలిసింది. ఇండస్ట్రీలో చోటుచేసుకునే నేరాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. ఇండస్ట్రీలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని, కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. సినిమా పనులు మొదలు కాకముందే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అనేకమంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదికలో తెలిపారు. 

డ్రగ్స్ మత్తులో మునుగుతూ బాధిత మహిళల రూమ్ తలుపులు తట్టేవారని.. వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది. సినిమా సెట్ల దగ్గర ఏర్పాటు చేసిన గదులు మహిళలకు సురక్షితంగా లేవని, దాడి జరుగుతుందనే భయంతో లేడీ ఆర్టిస్టులతో కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు వెళ్లాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. 

కొందరు నిర్మాతలు, దర్శకులు, నటులు మాఫియా చెప్పినట్టుగా చేస్తున్నారని ప్యానెల్ ఆరోపించింది. సినిమా సెట్‌లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి ప్రాథమిక  హక్కులను నిరాకరిస్తున్నారని పేర్కొంది. రుతుస్రావం సమయంలో మహిళా ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారని, ఇక సినిమాల్లో నటించడానికి ముందే లైంగిక కోరికలకు లొంగిపోవాలని అడుగుతారు అని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఈ నివేదిక మాలీవుడ్‌తో సహా అన్ని చిత్రపరిశ్రమల్లో కలకలం రేపుతోంది.