వ్యసనశీలతే పతనావస్థకు మూలం
సప్రత్యాదేయంద్యూతమ్,
నిష్ర్పత్యాదేయం స్త్రీ వ్యసనమ్,
ఆదర్శనం, కార్య నిర్వేదః,
కాలాతిపాతనాదనర్థః ధర్మలోపశ్చ,
తంత్రదౌర్బల్యమ్, పాపానుబంధశ్చేతి..
(కౌటిలీయం 8
సమాజంలో కనిపించే ఏడు దుర్వ్యసనాలను వివరించాడు, ఆచార్య చాణక్య. అందు లో మూడు క్రోధం వల్ల (వాక్పారుష్యం, అర్థదూషణం, దండపారుష్యం), నాలుగు కామం వల్ల (వేట, జూదం, స్త్రీ వ్యసనం, మద్యపానం) కలుగుతాయని చెప్పాడు. ఇందులో జూదమాడడం దుర్లక్షణమని, అయి తే దానినుంచి మనిషిని మరల్చవచ్చు కానీ, స్త్రీవ్యసనం (స్త్రీపురుషుల మధ్య అదుపుతప్పిన పరస్పర లైంగికాసక్తి) నుంచి దృష్టిని మరల్చడం కష్టతరమని చెపుతాడాయన.
స్త్రీ వ్యసనపరులైన పాలకులు ధార్మిక వర్తనకు దూరమై, రాజ్యవ్యవహార నిర్వహణలో దుర్బలులవుతారని, ప్రజలకు, అధికారులకు, అమాత్యాదులకు కూడా అందుబా టులో ఉండరని, పని చేయాలనే ఉత్సాహం లోపించి, ప్రతి పనినీ వాయిదా వేస్తూ, రాజ్యకార్యాలపై ఆసక్తి కోల్పోతారని చెపుతాడాయన. సమయపాలన పాటించకపో వడం వల్ల పరిపాలనా వ్యవస్థ బలహీనమై అనర్థాలకు కారణమవుతుంది.
స్త్రీ వ్యసనానికి తోడుగా మద్యపాన వ్యసనమూ ఉన్న పాలకుల బాధ్యతారాహిత్యం రాజ్యాన్ని పతనావస్థకు చేరుస్తుందని చాణక్య అభిప్రాయం. వ్యసనాలను ప్రత్యేకంగా చెప్పి హెచ్చరించడం వల్ల చాణక్య... పాలకుల వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించడం లేదు. దానికన్నా ప్రజాసంక్షేమం, రాజ్య సుస్థిరత, ప్రజల భద్రత, సంక్షేమాలను నిలపాల్సిన నాయకత్వ లక్షణాలను నిర్దేశించడంపై మాత్రమే దృష్టి పెడుతున్నాడని భావించాలి.
సాధారణంగా పాలకులను ప్రజలు అనుకరిస్తారు. అందువల్ల పాలకులలో వ్యక్తిగత నైతిక విలువలు ప్రతిష్ఠితం కావాలి. పాలకులు వ్యక్తిగత నైతిక విలువలను పాటించ కపోతే, ప్రజలలో క్రమశిక్షణ లోపిస్తుంది. అధికారులలో అలసత్వం ఏర్పడుతుంది. బాధ్యతలు హక్కులుగా భావించే అధికారం వల్ల పాలనావ్యవస్థలో స్వార్థపరత హెచ్చి పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటుంది. అందుకే పాలకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెపుతున్నాడు. నిజానికి వ్యసనాలు ఒంటరిగా నిలువవు.. అబద్ధాలాడ డం, ధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కుట్రలు, కుతంత్రాలు పన్నడం.. ఇలాంటివన్నీ ఒకదాని వెంట మరొకటి వ్యక్తిని ఆశ్రయిస్తాయి.
జూదం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి, నేర ప్రవృత్తి పెరుగుతుంది. అప్పుల పాలవుతారు. వ్యవస్థలో అవినీతి పెరగుతుంది. కాబట్టి జూదవ్యసనం ప్రమాదకర మైనదే. అయినా దాని వల్ల కలిగే నష్టాలను గ్రహించిన తర్వాత కొందరు దానిని విడిచిపెట్టగలరు. కానీ, నిరంతరం కోరికలను పెంచుతూ, రహస్య వివాహేతర సంబంధాలకు దారితీసే లైంగికాసక్తి... విలువైన సమ యాన్ని, ధనాన్ని, మానసిక శక్తిని కూడా హరిస్తుంది. అమిత కామాసక్తి హనీట్రాప్, బ్లాక్‌మెయిల్, గూఢచర్యం వంటి ప్రమాదాలకు కూడా అవకాశం కలిగిస్తుంది. ముఖ్యం గా, ప్రత్యర్థుల రాజకీయ కుట్రలకు బలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పాలకులకు స్త్రీవ్యసనం జూదం కన్నా ప్రమాదకరమని భావి స్తున్నాడు, చాణక్య.
భారతంలో నలుడు, ధర్మరాజు జూదవ్య సనాల వల్ల విపత్తులను ఎదుర్కొన్నారు. రా జ్యాన్ని, ప్రతిష్ఠను కోల్పోయారు. కానీ, దాని దుష్పరిణామాలను గుర్తించి, ఆ వ్యసనాన్ని అధిగమించడం వల్ల తిరిగి రాజ్యాధికారాన్ని పొందగలిగారు. ఉత్తమ పాలకులుగా నిలిచారు. రామాయణంలో రావణుడు స్త్రీవ్య సనం కారణంగా సీతను చెరబట్టి తాను నశించడమే కాక లంకానగర పతనానికి కారణమయ్యాడు. ధర్మరాజు, నలుడు పశ్చాత్తాపం చెందడం వల్ల వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకున్నారు.
రావణుడికి మారీచుడు, హను మంతుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, మం డోదరి.. ఇలా ఎందరో ఆప్తులు చేసిన హెచ్చరికలు చెవికెక్కని కారణంగా తన కుటుంబా న్నీ, రాజ్యాన్నీ, చివరికి తన ప్రాణాన్నీ కోల్పోయాడు. నిజానికి జూదవ్యసనం నుంచి విముక్తి సాధ్యమే కానీ కామవ్యసనం వివేకాన్ని కప్పివేస్తే పతనం అనివార్యమవు తుంది. స్త్రీవ్యసనానికి మద్యపానం, అధికార దుర్వినియోగం తోడైతే ప్రాణహాని, మానహాని కలుగుతుందని భారతంలో కీచకుని వృత్తాంతం తెలుపుతుంది.
ప్రారంభంలో వ్యక్తిగత ఆనందంగా మొలకెత్తే వ్యసన దుర్బలత్వం, పాలకులలో పరిపాలనా సంక్షోభ సమస్యగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నది. బలహీన మైన నాయకుడు పరిపాలనా వ్యవస్థపై పట్టును కోల్పోవడం వల్ల పతనావస్థకు చేరుకుంటాడు. ప్రస్తుత కాలంలో కూడా వ్యక్తిగత వ్యసనాలు నియంత్రణ కోల్పోయినప్పుడవి వ్యక్తి జీవితానికే పరిమితం కాకుం డా కుటుంబ, సామాజిక వ్యవస్థలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఆధునిక సమాజంలో నియంత్రణ లేని వ్యక్తిగత ఆకర్షణలు, వివాహేతర సంబంధాలు, పరస్పర అనుమానాలు... బ్లాక్‌మెయిల్ వంటి పరిస్థితులకు దారితీసి, కొన్ని సందర్భాల్లో హిం సాత్మక పరిణామాలకు కారణమవుతున్నాయి. వివాహేతర లైంగిక సంబంధాల కారణంగా పిల్లలను, భర్తలను చంపేస్తున్న భార్యలను, భార్యలను చంపేస్తున్న భర్తలను గూర్చిన వార్తాకథనాలు చూస్తున్నాం. ఇది వ్యక్తి తన ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోతే, వివేకం ఎలా క్రమంగా క్షీణిస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఎవరైతే ఆ వ్యసనాల దుష్ర్పభావాలను గుర్తించి తమ దృష్టికోణాన్ని మార్చుకుంటారో వారు ఉత్త మ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
ఒక్కొక్కరి అనుభవాలు ఒక్కొ విధంగా ఉంటాయి. ఒక చెప్పులు తయారు చేసే సంస్థ అధినేత తన మార్కెటింగ్ మేనేజర్‌ను ఒక ప్రాంతానికి పంపి అక్కడి అవకాశాలను పరిశీలించి నివేదికను ఇవ్వమని కోరాడు. అతను వెళ్లి వచ్చాక.. అక్కడ అందరూ చెప్పులు లేకుండానే నడుస్తారు కాబట్టి అక్కడ మనకు అవకాశం లేదని నివేదికను ఇచ్చాడు. అది నచ్చని అధినేత మరొక మేనేజర్‌ను పంపాడు. అతను అక్కడ అందరూ చెప్పులు లేకుండా నడుస్తారు.. అయితే వారికి చెప్పులు వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సరైన అవగాహన కలిగించగలిగితే చక్కని అవకాశాలు ఉంటాయని నివేదికను ఇచ్చాడు.
ఇరువురూ చూసింది ఒక ప్రాంతాన్నే.. ఒకే సమాజాన్నే అయినా ఇరువురి అనుభవాలు, ఆలోచనలు, జీవిత ప్రయోజనాలు వైవిధ్యంగా ఉన్నాయి. అలా గే వ్యసనాల పట్ల ఆకర్షితులయ్యే వ్యక్తుల అనుభవాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి. వ్యక్తి తన జీవిత ప్రయోజనాన్ని గుర్తించి, వ్యసనాలు అనే తమ ఇష్టాయిష్టాలు ఎలా తమ జీవిత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయో గ్రహిస్తే వారి జీవితాలను ఉన్నతీక రించుకుంటారు. వ్యసనాల ప్రభావం నుంచి బయటపడే అవకాశాలు అన్వేషిస్తాడు.
సాధారణ ప్రజలు ఆకర్షణలకు, వ్యసనాలకు లోనైతే, వారి కుటుంబాలు మాత్రమే నష్టపోతాయి. అదే పాలకులు వ్యసనశీలురైతే రాజ్యపాలన కుంటుపడుతుంది. అందుకే చాణక్య అభిప్రాయపడినట్లుగా, ప్రజలైనా, పాలకులైనా వారివారి జీవన ప్రయోజనాలను నెరవేర్చాలంటే ముందు గా తమ ఇంద్రియాలను జయించగలగాలి. ఆత్మనిగ్రహం లోపించిన పాలకుల వ్యక్తిగత బలహీనతలు పరిపాలనా సంక్షోభాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంటుంది. అందుకే వ్యక్తి జీవితానికైనా, రాజ్యపాలనా స్థిరత్వానికైనా, సమర్థవంతమైన నాయకత్వానికైనా ఆత్మనిగ్రహణ అత్యంత ముఖ్యమైన అర్హతగా భావించాడు, చాణక్య.
పాలకుర్తి రామమూర్తి






