8 July, 2026 | 2:00 AM

ఆర్థిక అస్థిరతకు సామాన్యుడి బలి

08-07-2026 12:00 AM

దాదాపు రెండు దశాబ్దాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మన దేశం దశాబ్ది కాలంగా, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు నుంచి ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్నది. పుండుమీద కారం చల్లినట్టు కరోనా విలయం మధ్యతరగతి, పేద ప్రజలపై పంజా విసిరింది.

దీంతో దేశంతోపాటు సామాన్య ప్రజలు కూడా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారు. అదే సమయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, గాజాపై ఇజ్రాయెల్ దాడులు, ఇక తాజాగా ఇరాన్ పోరు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత మరింత తీవ్రమైంది. దీంతో సామాన్యుడి జీవితం దుర్భరమైంది. రష్యా యుద్ధం వల్ల యూరప్ దేశాలు తీవ్రంగా ఆర్థికంగా దెబ్బతిన్నాయి. కానీ, ఇరాన్‌పై అమెరికా యుద్ధం మూలంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో, అన్ని దేశాల  సప్లయ్ చైన్ దెబ్బతిన్నది. చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ఇంధన ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారు. కొనుగోలు శక్తి తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. అదే సమయంలో ట్రంప్ విధిస్తున్న సుంకాల కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఏ విపత్తు సంభవించినా ముందుగా సామాన్యుడు సమిధ గా మారుతున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఏఐ కారణంగా ఐటీ రంగంలో లేఆఫ్‌లు పెరిగి చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న అనేకమంది అసంఘటిత కార్మికులు, ఉద్యోగులు రివర్స్ మైగ్రేషన్‌తో తిరిగి భారత్‌కు చేరుకున్నారు.

ఇప్పటికే నిరుద్యోగంతో సతమతమవుతున్న మన దేశానికి ఇది పెనుభారంగా మారింది. అయితే అదే సమ యంలో కొందరు కార్పొరేట్ల వ్యాపారా లు వృద్ధి చెంది దేశ జీడీపీ వృద్ధి చెందింది. దీన్ని చూపుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని పాలకులు నమ్మబలుకుతున్నారు. వాస్త వానికి సామాన్య ప్రజల జీవితాలు ఆర్థికం గా చితికిపోయాయి. అందుకే ప్రజల కొను గోలు శక్తి పెంచే ఉద్దేశంతో గతేడాది కేంద్రం జీఎస్టీ శ్లాబ్‌లను సవరించింది. అయినా ఫలితం దక్కలేదు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయారు.

హోటళ్లు, పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆహర సంక్షోభంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు ఎల్ నినో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే దాని ప్రభావం యూరప్ దేశాలపై పడింది. ఇక మన దేశంలో రుతుపవనాలు దారితప్పాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. దీని వల్ల భవిష్యత్తులో ఆహార సంక్షోభం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణానికి ఆహార సంక్షోభం కూడా తోడైతే సామాన్య, మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

యుద్ధాలు, ప్రకృతి విపత్తులు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపుతో సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రైతులకు భరోసా కల్పించాలి. పంటల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సబ్సి డీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలి. పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి.

ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవ స్థగా భారత్ రూపాంతరం చెందడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, జీడీపీ వృద్ధి వంటి కాగితాలపై కనిపించే గణాంకాల వల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని పాలకులు గ్రహిం చాలి. సామాన్య ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలతోనే దేశాభి వృద్ధి ముడిపడి ఉం టుంది. సామాన్యుల ఆదాయం పెరిగిన ప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని కేం ద్ర, రాష్ట్ర పాలకులు గ్రహించి, అందుకు అనుగుణంగా కార్యా చరణ రూపొందించాలి.

వ్యాసకర్త సెల్: 6305682733

ఐ.ప్రసాదరావు