మెరుగైన పీఆర్సీ ఎప్పుడిస్తారు?
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అనేది కేవలం జీతాల పెంపు కార్యక్రమం కాదు. అది ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను, పరిపాలనా సామర్థ్యాన్ని, ప్రభుత్వంపై ఉద్యోగుల విశ్వాసాన్ని కొలిచే ప్రమాణం. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను ద్రవ్యోల్బణం, జీవన వ్యయం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయం కొనసాగినా, తెలంగాణ ఉద్యోగుల దృష్టిలో పీఆర్సీ చరిత్ర అంటే కేవలం వేతనాల చరిత్ర కాదు; అది అన్యాయం, వివక్ష, ఉద్యమాలు, రాజకీయ నిర్ణయాలు, చివరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఒక సామాజిక- రాజకీయ గాథ.
విలీనంతో మొదటి అన్యాయం
1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న వేతన నిర్మాణం, సేవా నిబంధనలు అప్పటి మద్రాస్ రాష్ట్రంతో పోలిస్తే కొన్ని అంశాల్లో మెరుగ్గా ఉండేవి. నిజాం పాలనలో సర్కారీ ములాజిమ్ యూనియన్ వంటి ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలు లభించాయి. కానీ, భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి మారింది.
మొదటి పీఆర్సీ అమలులో తెలంగాణ ఉద్యోగుల వేతనాలను ఆంధ్ర ప్రాంత ఉద్యోగులతో సమానీకరించడం వల్ల, అప్పటికే అధిక వేతనాలు పొందుతున్న తెలంగాణ ఉద్యోగుల వేతనాలు తగ్గిపోయాయని తెలంగాణ ఉద్యమ మేధావులు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ దీనినే మొదటి పీఆర్సీ కాదు, పే రిడక్షన్ కమిటీగా అభివర్ణించారు. ఆ వ్యాఖ్య వెనుక తెలంగాణ ఉద్యోగుల ఆవేదన దాగి ఉంది. తెలంగాణ ప్రజలు రాష్ట్రం ఏర్పడిన తొలి రోజే ఉద్యోగాల విషయంలో నష్టపోయారని, వేతన అసమానతలే తరువాత ప్రాంతీయ అసంతృప్తికి బీజం వేశాయని చరిత్ర చెబుతోంది.
ఉద్యోగుల ఆశలు నెరవేరాయా?
1958 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పది వేతన సవరణ కమిషన్లు ఏర్పాటయ్యాయి. అయితే తొలి రెండు పీఆర్సీలు ఉద్యోగుల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురాలేకపోయాయి. తరువాత 1982, 1986, 1993 పీఆర్సీల్లో కూడా 10 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే అమలైంది. ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న సమయంలో ఈ పెంపు ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడలేకపోయింది. ఇది ఒక కీలక ఆర్థిక సత్యాన్ని తెలియజేస్తుంది. జీతం పెరగడం ఒకటి, జీవన ప్రమాణం మెరుగుపడటం మరోటి. ద్రవ్యోల్బణం కంటే తక్కువ స్థాయిలో వేతనాలు పెరిగితే ఉద్యోగి వాస్తవ ఆదాయం తగ్గుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చాలా కాలం ఇదే జరిగింది.
1999 పీఆర్సీ ఉద్యోగ సంఘాల చరిత్రలో ఒక మలుపు. కమిషన్ తక్కువ ఫిట్‌మెంట్ సిఫారసు చేసినప్పటికీ, ఉద్యోగ సంఘాల ఉద్యమాల ఒత్తిడితో ప్రభుత్వం 25 శాతం ప్రకటించాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో పలు విడతల డీఏ పెండింగ్‌లో పెట్టడం, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను విస్తరించడం ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఉద్యోగిని భాగస్వామిగా కాకుండా వ్యయభారంగా చూసే విధానాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర పోరాటాలు చేశాయి. ఈ అసంతృప్తి రాజకీయ పరిణామాలపైనా ప్రభావం చూపిందని అప్పటి రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంతో మార్పు
2010 పీఆర్సీ సాధారణ పీఆర్సీ కాదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో కమిషన్ 27 శాతం ఫిట్‌మెంట్ సిఫారసు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వం 39 శాతం ప్రకటించింది. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. తెలంగాణ ఉద్యమం ప్రభుత్వాల నిర్ణయాలను ఎలా ప్రభావితం చేసిందో తెలిపే ఉదాహరణ. రాజకీయ అస్థిరత, ఉద్యోగుల ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి.
స్వరాష్ట్రంలో ఆత్మగౌరవ పీఆర్సీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిస్థితి పూర్తిగా మారింది. ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యోగులను ప్రభుత్వం భాగస్వాములుగానే చూసింది. 2015 పీఆర్సీ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను స్వయంగా ఆహ్వానించడం ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికింది. ఉద్యోగ సంఘాల జేఏసీ 42 శాతం ఫిట్‌మెంట్ కోరగా, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 43 శాతం ప్రకటించారు.
భారతదేశ పీఆర్సీ చరిత్రలో ఉద్యోగులు కోరిన దానికంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించిన అరుదైన ఉదాహరణగా ఇది నిలిచింది. మొదటిసారి ఉద్యోగుల అసంతృప్తి లేని పీఆర్సీగా చరిత్రలో నిలిచిపోయింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంలో కమిషన్ 7.5 శాతం సిఫారసు చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూడడం ప్రభుత్వ విధానానికి నిదర్శనమని ఉద్యోగ సంఘాలు భావించాయి.
హామీలు సరే, నిర్ణయాలేవీ?
2023లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ మూడవ పీఆర్సీని ఏర్పాటు చేసింది. 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం ఉద్యోగుల్లో ఆశలు పెంచింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని తమ మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
మూడేళ్లు గడిచినా కమిషన్ నివేదిక సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రశ్న ఒక్కటే. ఐదేళ్ల కాలానికి అమలు చేయాల్సిన పీఆర్సీని తయారు చేయడానికి ఐదేళ్లు పడితే ఆ పీఆర్సీ వల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు ఆలస్యమవుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులపై కూడా స్పష్టత లేదు. యుద్ధాల కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఉద్యోగుల కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను ఖర్చుగా చూడదు. అది ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు పెట్టే పెట్టుబడిగా చూస్తుంది. సంతృప్తి చెందిన ఉద్యోగి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాడు. నిరాశలో ఉన్న ఉద్యోగి నుంచి సమర్థవంతమైన పరిపాలన ఆశించడం అసాధ్యం.
ఉద్యోగులను గౌరవించిన ప్రభుత్వాలు పరిపాలనలో స్థిరత్వాన్ని సాధించాయి. ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నాయి. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించి, రెండో తెలంగాణ పీఆర్సీపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. పెండింగ్ డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, హెల్త్ స్కీమ్, హెచ్‌ఆర్‌ఏ, ఇతర సమస్యలను పరిష్కరించాలి. హెల్త్ కార్డుల కోసం రెండు నెలలుగా 1.5 శాతం వేతనంలో కట్ చేశారు. కానీ, విధి విధానాలు లేకపోవడంతో వైద్యం కోసం ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర చెబుతున్న ఒకే ఒక్క సత్యం ఏమిటంటే ఉద్యోగుల సహనాన్ని పరీక్షించిన ప్రభుత్వాలు నిలవవు. ఉద్యోగులను భాగస్వాములుగా చూసిన ప్రభుత్వాలే చరిత్రలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు మారవచ్చు, రాజకీయ నినాదాలు మారవచ్చు. కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే వ్యవస్థకు న్యాయం చేయడం ప్రతి ప్రభుత్వానికి ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యత.
ఒకటవ తారీకు వేతనం రావడం ఆత్మగౌరవానికి ప్రతీక కాదు, మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలు దాటినా అమలు చేయకపోవడం అణచివేతకు నిదర్శనం. గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫిట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అనివార్య పరిస్థితులు కల్పించే ప్రయత్నం జరగాలి. వీరోచిత పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యోగుల సహనాన్ని బలహీనతగా చూస్తే, దానివల్ల జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది.
వ్యాసకర్త: టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు
గుండవరం దేవీప్రసాద్






