పీసీసీఎఫ్‌గా వినయ్‌కు అదనపు బాధ్యతలు
ప్రస్తుత పీసీసీఎప్ సువర్ణ 30న పదవీ విరమణ
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ అటవీ శాఖలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సీ సువర్ణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సువర్ణను ప్రభుత్వ సేవల నుంచి రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డాక్టర్ సీ సువర్ణ పదవీ విరమణతో.. ఆ స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి, ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వినయ్ కుమార్‌కు పీసీసీఎఫ్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వినయ్ కుమార్ బాధ్యతలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం. 915ను విడుదల చేసింది. రాష్ట్ర అటవీ శాఖ పరిపాలనా వ్యవహారాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.






