కేటీఆర్ అబద్దాలను ప్రజలు నమ్మరు
ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): కేటీఆర్ చెప్పే అబద్దాలను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదని, ఇక ప్రజలు ఎలా నమ్ముతారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే చెవుల్లోనుంచి రక్తం కారడం తప్ప ఏం జరగదన్నారు. ప్రజలు అబద్దాలను విని పారిపోతారన్నారు. శుక్రవారం అద్దంకి దయాకర్ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ రెస్టు తీసుకుంటుంటే ఆయన పేరు చెప్పుకుని కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు.
తమ ప్రయోజనాల కోసం పడుకున్న కేసీఆర్‌ను లేపాలని చూస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన 100 ఇంటిగ్రేటేడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, స్కాలర్ షిప్‌లు కనిపించడం లేదన్నారు. ప్రజలు తప్పు చేయరని, వాళ్లకి ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో బాగా తెలుసని అద్దంకి పేర్కొన్నారు.






