అధికమాసం.. ఆడబిడ్డల సంబురం
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో తాజాగా (అధికమాసం) దొండ మాసం రావడంతో ప్రతి ఇంట్లో మే 17 నుంచి జూన్ 15 వరకు ఆడబిడ్డల సంబరం కనిపిస్తున్నది. భారత కాలమానం సంవత్సరంగా లెక్కిస్తాం. ఇందులో చంద్రమానం సౌరమానం కొలుస్తాం. చంద్రమానం 354 రోజులు, సౌరమానం 365 రోజులు.
రెండిటి మధ్య 11 1/2 రోజుల సర్దుబాటు కాలాన్ని దొండ మాసం, అధిక మాసం, పురుషోత్తమ మాసంగా వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. పెళ్లిళ్లు ఇండ్ల గృహప్రవేశాలు. ఇతర శుభకార్యాలు నిర్వహించకుండా పితృ కార్యాలు, కుటుంబ పెద్దలను పూజించడం, ఆడబిడ్డలను గౌరవించడం వంటి పనులు చేస్తే ఆ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని, ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం.
తెలంగాణలో ప్రతి పండుగకు ప్రత్యేక సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉంటాయి. దొండ మాసానికి కూడా ఒక ప్రత్యేకత చాటుతూ ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు గౌరవంగా కొలిచే సంప్రదాయం నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఆడబిడ్డలను వారి తల్లిదండ్రులు ఇంటికి పిలిపించుకుని వారికి కొత్త బట్టలు కొని, పిండి వంటకాలతో తయారుచేసిన 33 దొండాలను (తీపి వంటకా లు) తయారుచేసి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతున్నారు.
దొండలను ఆడబిడ్డలకు పంపడానికి ఆర్థిక స్తోమతను బట్టి స్టీలు, రాగి పాత్రలు ఇస్తున్నారు. కొందరు వెండి, బంగారం నగలను కూడా కానుక రూపంలో ఇచ్చి ఆడబిడ్డల ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. ఇటువంటి పండుగలు అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్య వైర్యం ఉన్నప్పటికీ ఆ వైరమ్యాలను పక్కనపెట్టి ఆప్యాయంగా ఉండేందుకు ఉపయోగపడతున్నాయి. పుట్టింటి గౌరవాన్ని చాటి చెప్పేలా వారి తల్లిదండ్రులు ఆడబిడ్డలకు ఇటువంటి సంప్రదాయం చేపట్టడంతో నిర్మల్ జిల్లాలో పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో నెలకొంది. దొండల పండుగ నేపథ్యంలో వస్త్ర, వ్యాపార దుకాణాలు, పూజా సామగ్రి, కిరాణా దుకాణాల్లో సందడి కనిపిస్తుంది. దేవాలయాల్లోనూ సందడి నెలకొన్నది.
పుట్టింటి గౌరవం
భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇటువంటి సంప్రదాయ పండుగలో దొండ మాసం గత నెల రోజులుగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలకు పిలిపించుకొని కొత్త బట్టలు వేసి తీపి వంటకాలు బహుమతులుగా ఇస్తున్నారు. ఆ బిడ్డకు పుట్టింటి గౌరవం దక్కేందుకు ఈ మాసం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కుటుంబంలో విభేదాలు తొలగి అందరూ కలిసిమెలిసి ఉండే అవకాశం దక్కుతుంది.
గంగామణి, నిర్మల్
మంచి సంప్రదాయమే
అధికమాసం దొండ నెలలో ఆడబిడ్డలకు గౌరవంగా నిర్వహిస్తున్న దొండ పండుగ మంచి సంప్రదాయం. ఆడబిడ్డలను పిలిపించుకొని కొత్త బట్టలు, తీపి వంటకాలు పెట్టి ఇతర కట్నకానుకలుగా ఇచ్చి గౌరవిస్తే ఆడబిడ్డ ఇచ్చే దీవెన ఆ కుటుంబానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది. ప్రతి 32 నెలలకు ఒకసారి ఈ మాసం వస్తుంది.
జంగం రాజు (సూర్యాపూర్, పూజారి)






