ఉపాధి పనుల్లో రీల్స్ సందడి!
పల్లెల్లో సరికొత్త వినోద విప్లవం
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ విప్లవం మానవ ఆలోచనా సరళిని పూర్తిగా మార్చేసింది. నిన్నటి వరకు కేవలం పొలం పనులకు, కూలి పనులకు పరిమితమైన కూలీలు, యువత, మహిళలు నేడు సోషల్ మీడియా వేదికగా రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే ఉపాధి కూలీలు.. ప్రస్తుతం పని ప్రదేశాలను కాస్తా ‘రీల్స్’ షూటింగ్ స్పాట్‌లుగా మార్చేస్తూ ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రానికి చెందిన తిరుపతమ్మ, యాదయ్య భార్య భర్తలు. ఉపాధి హామీ కూలీకి వెళుతూ పని ప్రదేశంలో పెళ్లిరోజు జరుపుకున్నారు. పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు వేషధారణలో తట్ట పారా లతో భాజా భజంత్రీలుగా ఇరువురికి ఉపాధి కూలీలంతా పెళ్లి పెద్దలుగా తంతు కానించారు. గతంలో ఉపాధి హామీ పనులంటే ఎండలో చెమటోడ్చటం, గుంతలు తవ్వడం, అలసట మాత్రమే గుర్తుకు వచ్చేవి.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. పని విరామ సమయాల్లో కూలీలు గ్రూపులుగా చేరి చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తున్నారు. ఒకరు కెమెరా పడితే, మరొకరు నటిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను గమనిస్తే, ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఏకంగా ‘పెళ్లి తంతు’ రీల్స్ చేయడం విశేషం. మట్టి తవ్వే పారలను, గంపలను మంగళ వాయిధ్యాలుగా వాడుకుంటూ.. కూలీలే వధూవరులుగా, పురోహితులుగా మారిపోయి పెళ్లి నాటకాలను రక్తి కట్టిస్తు న్నారు.
షష్టిపూర్తి వేడుకల తంతు, సినిమా పాటలకు స్టెప్పులు వేయ డం, జానపద గేయాలకు లయబద్ధంగా నృత్యం చేయడం, వైరల్ కామెడీ డైలాగులకు లిప్ సింక్ ఇవ్వడం వంటి వీడియోలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. వీటికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తుండటంతో కూలీల ఉత్సాహం మరింత రెట్టింపవుతోంది.
ప్రతిభకు వేదిక.. ఒత్తిడికి విరుగుడు
ఈ సరికొత్త ట్రెండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు దీనిని సానుకూల కోణంలో చూస్తున్నారు. ఉదయం నుంచి ఎండలో కష్టపడి పనిచేసే కూలీలు, తమ అలసటను మరిచిపోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి వినోదాన్ని ఆశ్రయించడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు. పల్లెటూరి ప్రజల్లో దాగున్న నటనా ప్రతిభను బయటకు తీయడానికి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మంచి వేదికగా మారాయని కొని యాడుతున్నారు.
ఏ విధమైన శిక్షణ లేకపోయినా వారు పండించే హాస్యం, చేసే నటన ప్రొఫెషనల్ ఆర్టిస్టులకు తీసిపోని విధంగా ఉం డటం గమనార్హం. మరోవైపు, ఈ రీల్స్ సంస్కృతిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో జరిగే ఉపాధి హామీ పనుల సమయాన్ని కూలీలు ఇలా రీల్స్ కోసం వృథా చేయడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను విస్మరించి, పారలు, గడ్డపారలతో ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి.






