14 June, 2026 | 1:27 AM

700 ఏళ్ల అఖండ జ్యోతి!

14-06-2026 12:00 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం అపూర్వ ఆధ్యాత్మిక అద్భుతానికి వేదికగా నిలుస్తోంది. కాకతీయుల కాలంలో క్రీస్తుశకం 1314లో వెలిగించిన అఖండజ్యోతి (నందదీపం) రాజుల కాలంపోయినా, తరాలు మారినా నేటికీ ఆరకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది. 700 ఏళ్లుగా భక్తుల నమ్మకానికి, భక్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోన్న ఈ దీపం.. ఆ ప్రాంతానికే మకుటాయమానంగా మారింది.

ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ దీపం వెలుగుతోందని స్థానికులు చెబుతారు. ఈ అఖండజ్యోతిని దర్శిస్తే కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని, సంతానం లేని వారికి సంతానప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే సమీప గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి అఖండజ్యోతిని దర్శించుకుంటారు. శ్రీరామనవమి, వార్షికబ్రహ్మోత్సవాలు, దసరా, ఉగాది, ధనుర్మాసం సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు కలిసి దీప సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నూనె కొరత లేకుండా భక్తుల సహకారంతో అఖండజ్యోతిని నిరంతరం వెలిగిస్తున్నారు. పూర్వీకులు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని నేటి తరం కూడా అదే భక్తిశ్రద్ధలతో కొనసాగించ డం విశేషం.

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా గుర్తింపు 

గంభీరావుపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆల యం స్థానికంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. అఖండదీపం విశేషాన్ని తెలుసుకున్న భక్తులతో పాటు పరి శోధకులు సైతం ఆలయాన్ని సందర్శిస్తున్నారు. చరిత్ర, ఆధ్యాత్మికత, సంప్రదాయం కలగలిసిన ఈ క్షేత్రం భక్తులకు ప్రశాంతతను అందిస్తోంది.

అరుదైన ఆధ్యాత్మిక వారసత్వ సంపద 

కాలానుగుణంగా ఎన్నో ఆలయాలు, సంప్రదాయాలు మార్పులకు లోనైనా గంభీరావుపేటలో అఖండదీపం మాత్రం ఏడు శతాబ్దాలుగా నిరంతరాయంగా వెలుగులు ప్రసాదిస్తోంది. గ్రామస్తుల ఐక్యత, భక్తి, సంప్రదాయ పరిరక్షణకు ఈ జ్యోతి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 

అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి 

అత్యంత ప్రాచుర్యం పొందిన పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనులు దాతల సహకారంతోనే కొనసాగుతున్నాయి. ఆలయంలో గాలిగోపురం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. 

 మల్లుగారి నర్సాగౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్, గంభీరావుపేట