5 June, 2026 | 1:51 AM

శంషాబాద్ తర్వాత అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఆదిలాబాదే

05-06-2026 12:40 AM
  • ఎమ్మెల్యే పాయల్ శంకర్
  • రక్షణ శాఖ జేఎస్‌కు భూసేకరణ పత్రాల అందజేత

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): శంషాబాద్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద జాయింట్ ఎయిర్‌పోర్ట్ ఆదిలాబాద్‌కే సొంతమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతిని కలిసి, ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 1,580 ఎకరాల భూకేటాయింపుల అధికారిక పత్రాన్ని ఆయన అందజేశారు.

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని హర్షం వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద జాయింట్ ఎయిర్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఆదిలాబాద్‌లో 1,980 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోబోతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ అడిగిన దానికి మించి భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సుముఖత వ్యక్తం చేసిందని పాయల్ శంకర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న 369.45 ఎకరాల భూమితో పాటు, అదనంగా అడిగిన 1,550 ఎకరాలకు బదులుగా.. ఏకంగా 1,580 ఎకరాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వివరించారు. ఇందులో 1,500 ఎకరాలను రక్షణ శాఖకు, 80 ఎకరాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. అక్కడ ఉన్న 765 కేవీ హైటెన్షన్ లైన్లను మార్చడానికి సైతం రూ.310 కోట్ల భారీ వ్యయాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ రాసిందని స్పష్టం చేశారు.