జైళ్లకు భయపడం, కేసులు కొత్తేంకాదు
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సింగరేణిలో బొగ్గు దోపిడీని అడ్డుకుంటాం
మలక్‌పేట్, జూన్ 4 (విజయక్రాంతి): అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే భయపడేది లేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. తమకు జైళ్లు, కేసులు కొత్తేమీ కాదన్నారు. సింగరేణిలో అక్రమ బొగ్గు దోపిడీ విషయంలో బాల్క సుమన్ వెలుగులోకి తెచ్చిన దోపిడీని అడ్డుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న బాల్క సుమన్‌ను కేటీఆర్ గురువా రం ములాఖత్‌లో కలిశారు.
అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణిలో ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మున ఎందుకున్నాడని నిలదీశారు. సింగరేణి కుంభకోణంపై బీజేపీ నాయకుల మౌనం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం ఆపరని స్పష్టం చేశారు. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట తలసాని శ్రీనివాస్, సుధీర్‌రెడ్డి తదితరులున్నారు.






