స(ర్)రి చేస్తున్నారు...!
*ఓటరు జాబితా సవరణపై యంత్రాంగం ఫోకస్
*ఆబ్సెంట్లను వెతికే పనిలో సిబ్బంది
*గడువు పెంచడంతో ప్రత్యేక దృష్టి
*జిల్లాలో తుది దశకు చేరుకున్న ప్రక్రియ
నారాయణఖేడ్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈనెల 3 వరకు గడువు ఉండగా తాజాగా 10వరకు పాడిగించారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియలో డెత్, షిఫ్టింగ్, డూప్లికేట్ (ఆల్రెడీ ఎన్రోల్డ్), ఆబ్సెంట్, ఆదర్స్ అనే కాలమ్స్ ఆధారంగా తొలగింపునకు గురయ్యే ఓటర్ల సంఖ్య దాదాపుగా సిద్ధమైంది. గడువు సమీపిస్తుండటం, ఈ అబ్సెంట్లకు సంబంధించి సమాచారం లభ్యం కాకపోవడంతో ఇక అదే తుది జాబితా అనుకునే వరకు వచ్చింది.
ప్రస్తుతం గడువు పెంచడంతో ఈ వీటిపై బీఎల్డీ, బీఎల్‌ఎలకు దృష్టి సారించే అవకాశం వచ్చింది. వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 14.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 11.09 లక్షల మందికి పైగా (సుమారు 76.1%) ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా సుమారు 3.48 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన ఫారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ వివిధ దశల్లో పెండింగ్లో ఉంది.
ఆబ్సెంట్ల కాలమ్లో వేలాది ఓట్లు...
ఇప్పటివరకు జిల్లాలో పైన పేర్కొన్న కాలమ్స్ ఆధారంగా తొలగింపునకు గురయ్యే ఓట్లపై స్పష్టత వచ్చింది. ఇందులో డెత్, షిఫ్టింగ్, డూప్లికేట్ అంశాల్లో మార్పు చేసేందుకు అవకాశం లేదు. బీఎల్వోలు ఓటరు సమాచారం కోసం వెళ్లినప్పుడు వారి సమాచారం లభించకపోవడంతో అబ్సెంట్ గా నమోదు చేసుకున్నారు. ఇలా జిల్లాలో వేలాది ఓట్లు ప్రస్తుతం ఈ కాలమ్ లో ఉన్నాయి.
ఇలాంటి వారిని వెతికి ఎన్యూమరేషన్ ఫారమ్ పూరించి ఇస్తే ఈ సంఖ్యలో మార్పు చోటుచేసుకుంటుంది. తద్వారా తొలగింపునకు గురయ్యే ఓట్ల సంఖ్య తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ఓట్లపై ప్రస్తుతం బీఎల్వో, బీఎల్‌ఎలతో పాటు రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. వారు ఎక్కడ ఉన్నారో గుర్తిస్తూ సమాచారం రాబడుతున్నారు. వివరాలు తీసుకొని ఇప్పటివరకు అబ్సెంట్గా ఉన్న వారి పేరును పునరుద్దరించే పనిలో పడ్డారు.
తుది దశకు ప్రక్రియ..
జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పరంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. అయితే మొదట జూలై 24 వరకే ఈ ప్రక్రియ ముగిసిపోవాల్సి ఉండగా, గడువును ఈనెల 3కు పెంచారు. కొన్ని జిల్లాల్లో సవరణ ప్రక్రియ అలస్యం కావడంతో తాజాగా మళ్లీ 10వ తేది వరకు పొడిగించారు. గడువు సమీపిస్తుందని సమాచారం లభ్యంకాని వారికి సంబంధించి అబ్సెంట్గా నమోదు చేస్తూ వచ్చారు.
ఈ విషయంలో బీఎల్వోలపై కూడా అధికారుల నుంచి ఒత్తిడి ఉండడంతో వారు అడ్రస్ దొరకని ఓటరుకు సంబంధించి అబ్సెంట్ నమోదు చేస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సమయం పెంచినందున వారితో ప్రజెంట్ పలికిస్తామని చెబుతున్నారు. అలా ఎన్ని ఓట్లు తిరిగి పునరుద్ధరణకు గురవుతాయో చూడాల్సిందే.






