మృతుల కుటుంబాలకు గీతబంధు సేవా ట్రస్ట్ చేయూత
ఒక్కో కుటుంబానికి 20వేల రూపాయలు అందజేత
కేసముద్రం, ఆగస్టు 4 (విజయక్రాంతి): తాటి చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ గీత బంధు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 20వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
కేసముద్రం మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి మరణించిన వేముల చిన్న మల్లేశం, ఊటుకూరి శ్రీనివాస్ కుటుంబాల పరిస్థితిని రైల్వే పోలీస్ అధికారి బుర్ర సురేష్ గౌడ్ ఏపీ గౌడ సంఘం ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన గీత బంధు ట్రస్ట్ కార్యదర్శి వేముల వెంకటాచలం గౌడ్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల గౌడ సంఘం నాయకులు, కల్లుగీత కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఏపీ గీత సంఘం సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.






