30 April, 2026 | 5:50 PM

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో అందుబాటులోకి పెట్రోల్, డీజిల్

28-04-2026 08:19 PM

ఖమ్మం,(విజయక్రాంతి): గడిచిన రెండు రోజులుగా సరఫరా లేక, బంకులు మూతపడటంతో ఏర్పడ్డ పెట్రోల్, డీజిల్ కొరత ఇప్పుడు సమసిపోయింది. బిఆర్ఎస్ ఎంపీ,  పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అయిన వద్దిరాజు రవిచంద్ర చొరవ ఫలితంగా జిల్లాలో 24 గంటల్లో పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. ఆయిల్ సరఫరా కంపెనీలు బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్ పీసీఎల్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఆయిల్ ట్యాంకర్లను రిటైల్ అవుట్ లెట్ లకు తక్షణమే పంపి కొరతను నివారించాలి.

చేసిన సూచన మేరకు ఆయా కంపెనీలు స్పందించి సరఫరాను వేగవంతం చేశాయి. ఆ మేరకు ఖమ్మం జిల్లాకు సోమవారం150 ఆయిల్ ట్యాంకర్ల లోడు సరఫరా కాగా, మంగళవారం మరో 100 ట్యాంకర్ల లోడు సరఫరా కానుంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. ప్రజలెవరు ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వ చేయవద్దని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు.

ఎంపీ రవిచంద్ర కు పెట్రోలియం డీలర్ల కృతజ్ఞత

పెట్రోల్ డీజిల్ కొరతపై చొరవ చూపాలని తాము కోరిన వెంటనే ఆయా కంపెనీల ఉన్నతాధికారులతో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరింపజేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు ఖమ్మం జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  అధ్యక్షులు ఈశ్వర ప్రగడ రంగనాథ్, ప్రధాన కార్యదర్శి కూరపాటి మంజుల కృతజ్ఞతలు తెలిపారు. డీలర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా మెరుగుపడినందున.. అన్ని బంకులు ఎప్పటిలాగానే యధావిధిగా వినియోగదారులకు తమ సేవలందిస్తాయని పేర్కొన్నారు.