calender_icon.png 25 August, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏపల్లి హాస్టల్‌లో కల్తీ ఆహారం

05-12-2024 01:38:32 AM

  1. ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థత
  2. దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స 

నల్లగొండ, డిసెంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతన్న ఘటనలపై ఇటీవల హైకోర్టు ఆగ్రహించినా మార్పు కనిపించడం లేదు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని దుగ్యాల ఆదర్శ పాఠశాల హాస్టల్‌లో మంగళవారం రాత్రి కల్తీ ఆహరం తిని ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  కలెక్టర్ ఇలా త్రిపాఠి రాత్రే అక్కడికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగలేదని, కొంతకాలంగా విద్యార్థినులు సరిగ్గా ఆహారం తీసుకోని కారణంగా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ తెలిపారు.

కానీ విద్యార్థినులు మాత్రం తాము తిన్న ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యామని తెలిపారు. కొన్నిరోజులుగా హాస్టల్‌లో వండుతున్న భోజనం సరిగ్గా ఉండటం లేదని, ఎస్వోకు చెప్పినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బుధవారం ఉదయం పలు విద్యార్థి సంఘాలు దేవరకొండ ప్రభుత్వ దవాఖాన ఎదుట ఆందోళన చేశాయి. ఉదయం 10 గంటల తర్వాత దవాఖాన నుంచి విద్యార్థినులను తిరిగి హాస్టల్‌కు పంపారు. విద్యార్థినుల వసతి గృహాన్ని పలువురు అధికారులు తనిఖీ చేశారు. భోజనం, కూరలు, పరిసరాలను పరిశీలించారు.  

ఎమ్మెల్యే బాలూనాయక్ పరామర్శ

దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో చికి త్స పొందుతున్న విద్యార్థినులను ఉదయం ఎమ్మెల్యే బాలూనాయక్ పరామర్శించారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగలేదని, మూడు రోజులుగా విద్యార్థినులు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.   

ప్రభుత్వానిది మొద్దు నిద్ర: మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ 

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 950 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, 52 మంది మరణించారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు.