calender_icon.png 25 August, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చారా?

05-12-2024 01:39:59 AM

మోదీ ఇచ్చారా?.. చర్చకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సిద్ధమా?

యువ వికాసానికి ఇందిరమ్మ రాజ్యంలో బాటలు

ఎకరాకి రూ.కోటి.. సీక్రెట్ చెప్పని కేసీఆర్!.. ఆ ముగ్గురూ బీసీ వ్యతిరేకులా?

  1. 1024 కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  2. పెద్దపల్లి బస్టాండ్ వద్ద 4 ఎకరాల 31 గుంటల భూమి బస్‌డిపోకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
  3. పెద్దపల్లి జిల్లాలో నేడు డిపో ఏర్పాటు చేశాం.. రేపు రామగుండానికి విమానాశ్రయం తెస్తాం
  4. పెద్దపల్లి యువ వికాసం విజయోత్సవ సభలో సీఎం రేవంత్

* మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని బెదిరించి పెద్దపల్లిలో పనులు చేయించుకున్నారు

పెద్దపల్లి, డిసెంబరు 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో యువ వికాసానికి ఇందిరమ్మ రాజ్యంలో బాటలు వేశామని, ప్రభుత్వ రంగంలోనే ఖాళీలు భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా మన యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్షణపై దృష్టి సారించామని, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా తొలగించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వలలో నిర్వహించిన ‘యువవికాసం’ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమం త్రి జిల్లాలో రూ. 1,024 కోట్ల 90 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటుచేసిన ఆపరేషన్ గరుడ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, డీఈఈటీ, టాస్క్, ఎన్‌ఎస్‌ఐసీ, న్యాక్, యువజన క్రీడాశాఖ, సింగరేణి సంస్థ ద్వారా ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గ్రూప్ సింగరేణి పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు పంపిణీ చేశారు.

యువతకు నైపుణ్యత అందించే దిశగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ.. కిమ్స్ హాస్పిటల్, లక్ష్యా సంస్థ, రెడింగ్ టన్, లాజిస్టిక్ స్కిల్ కౌన్సిల్, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఆర్ బిందు ఫార్మా బ్లూ వీల్స్ వంటి ఏడు సంస్థలకు మధ్య ఎంవోయూ పూర్తిచేశారు.

ప్రైవే ట్ రంగంలో ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డీఈఈటీ (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ)ను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభించారు. విద్యార్థులకు, యువకులకు నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలను సీఎం ఆవిష్కరించారు.

అనంతరం యువ వికాసం విజయోత్సవ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కారణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన మాట మేరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని తెలిపారు.

గతంలో రెండు పర్యాయాలు పాలించిన కేసీఆర్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్ మాత్రం ఎకరం పొలంలో కోటి రూపాయల ఆదాయం పొందే రహస్యం మాత్రం రైతులకు చెప్పలేదన్నారు. రైతాంగానికి ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వకపోతే పోరాటం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యేను గత పాలకులు కరీంనగర్ జైల్లో బంధించారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, మంత్రిగా శ్రీధర్‌బాబు ఉన్నారని, కాబట్టే నేడు జిల్లాకు 1,024 కోట్లు మంజూరయ్యాయని, రోడ్లు, భవనాలు, సాగునీరు వంటితోపాటు, ఆర్టీసీ బస్సు డిపో వంటి అభివృద్ధి పనులు మంజూరు చేసుకున్నామని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మమ్మల్ని బెదిరించి పనులు చేయించుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు.

తమ్మిడిహెట్టి వద్ద బరాజ్..

తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి తీరుతామని, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. పదేళ్ల పాలన, పది నెలల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. 

బోనస్ ఎందుకు ఇవ్వలేదు..?

పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో రైతులు సన్నరకం వరిధాన్యం పండించారని, గత ప్రభుత్వాలు ధాన్యానికి బోనస్ ఎందుకు ఇవ్వలేదో ప్రజలు ఆలోచించాలని సీఎం అన్నారు. అత్యధికంగా 2 లక్షల ఎకరాల్లో సన్నరకం వడ్లు పండించిన రైతులు పెద్దపల్లి జిల్లాలోనే ఉన్నారని, 95 శాతం రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చెప్పారు.

నిరుద్యోగ యువతకు ప్రజా ప్రభుత్వం సంవత్సర పాలనలో 55 వేల 143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, హోంశాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, గ్రూప్స్, రెవెన్యూ శాఖ, పశుసంవర్థకశాఖ, పంచాయతీశాఖ, మొదలగు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను నింపామని అన్నారు. 

కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ..

కాళేశ్వరం నుంచి చుక్కనీరు పారనప్పటికీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించామని అన్నారు. గతంలో ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభు త్వం వ్యాపార సంస్థ కాదు, వరి వేస్తే ఉరి వేసుకోవాలని కర్కషంగా చెప్పింది కేసీఆర్ కాదా ? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

నేడు ప్రజాప్రభుత్వంలో రైతులకు ప్రతి గింజ మద్దతు ధరతోపాటు బోనస్ రావడం లేదా.. రైతులు ఆలోచించుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల 35 వేల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రానికి ఉందంటే అది తెలంగాణకు మాత్రమే ఉందని అన్నారు.

స్వయం సహాయక సంఘాలను గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రాబోయే పదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పారు. ఐకేపీ కేంద్రాలు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఆర్టీసీలో కిరాయి బస్సులు వంటి ప్రతి వ్యాపారంలో మహిళలను భాగస్వామ్యం చేస్తామన్నారు.

గతంలో విశ్వవిద్యాలయాలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విశ్వవిద్యాలయంలో వీసీలను నియమించడమే కాకుండా 11 వేల టీచర్ల నియామకం పూర్తిచేసి మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో కూడా టీచర్లను ఏర్పాటు చేశామని, ప్రతి పేదవాడికి విద్యను దగ్గరచేసే ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రాంతాల్లో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేస్తామని, శాతవాహన విశ్వవిద్యాలయానికి లా కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నామని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పద్ధతి ప్రకారం చెల్లిస్తున్నామని, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం వరకు కాస్మోటిక్ చార్జీలు పెంచామని, కోటి 10 లక్షల మంది ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 3700 కోట్ల ఖర్చు పెట్టామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 

21 నుంచి 35 సంవత్సరాలు మనిషి జీవితంలో చాలా కీలకమని, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగే యువకులకు విముక్తి కల్పించామన్నారు. 5 సంవత్సరాల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారని, ఒక్క రోజుల్లో అద్భుతాలు జరుగవని చెప్పారు. సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నందుకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ప్రజా ప్రభుత్వానికి అభినందించాలని, అప్పుడు ఆయన స్థాయి పెరుగుతుందన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన మేధావిత్వాన్ని ప్రజలకు పంచాలని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు తేలేదని, నేడు ప్రజాప్రభుత్వం వాటి ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 95 శాతం కులగణన పూర్తి చేసుకున్నామని తెలిపారు. కేసీఆర్ ఎందుకు కులగణనలో పాల్గొనడం లేదో బీసీ సంఘాలు ప్రశ్నించాలని సీఎం అన్నారు.

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ముగ్గురు బీసీ వ్యతిరేకులా అని ఆయన ప్రశ్నించారు. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలని బీసీ సోదరులను కోరుతున్నానన్నారు. రాజీవ్ గాంధీ మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారని, మహిళలకు సముచితమైన స్థానం ఉండాలని అన్నారు.

సిద్దిపేట జిల్లాలో కోకో కోలా ఫ్యాక్టరీ ప్రారంభించామని, భవిష్యత్తులో మంథని ప్రాంతానికి మరో కోకో కోలా ఫ్యాక్టరీ తెస్తామని చెప్పారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

బెడం పెడితే మొండిఘటమే! 

శ్రీధర్‌బాబుపై  సీఎం చలోక్తి

సభలో కాసేపు నవ్వుల వర్షం

చూస్తే అట్లుంటడు.. బేడం పెడితే మొండిఘటమే అని మంత్రి శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి రేవంత్ చలోక్తి విసర డంతో నిండు సభలో కాసేపు నవ్వుల వర్షం కురిసింది. ‘మీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పెద్దపెల్లి జిల్లాకు భారీగా నిధులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి న మాటం అబ ద్ధం.. తాను నాపై ఒత్తి డి తేలేదు, ఒక రకంగా మీకోసం నన్ను బెదిరించాడు.

అబ్బో మీ శ్రీధర్‌బాబు చూస్తేనే అట్లా ఉంటడు కానీ బెడం పెట్టి లోపలకు పంపిస్తే చాలా మొండిఘటం’ అని పెద్దపెల్లి యువ వికాసం వేదికపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వుల వర్షం కురిసింది. మొత్తం జిల్లా గురించి ఆలోచించి నిధు లు కోరడంలో అర్థం ఉంది కాబట్టి వెంట నే ఫైల్‌పై సంతకాలు చేసినట్టు సీఎం చెప్పుకొచ్చారు.

ఒక క్రమ శిక్షణ, ఒక పద్ధతి, నాయకత్వ లక్షణాలకు ప్రాణం పోస్తే అదే శ్రీధర్‌బాబు.. అని చెప్పగానే అభిమానులు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 11 నెలల్లోనే పెద్దపల్లికి ఇన్ని నిధులు తీసుకొచ్చాడంటే.. ఇంకా నాలుగేళ్లలో శ్రీధర్‌బాబు రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలుపుతాడని సీఎం వ్యాఖ్యానించారు. 

మోదీ సీఎంగా, పీఎంగా ఏం చేశారు

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు, దేశ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశారని, ఏ సంవత్సరమైనా గుజరాత్ రాష్ట్రంలో 5౫ వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సిద్ధమా అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.

గత ప్రభుత్వం లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఎలా ఉన్నాయి.. కాళేశ్వరం ఎలా  ఉందో కేసీఆర్ చూడాలన్నారు. 

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

సీఎం సభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కష్టం ఫలితంగా రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు.

యువతకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని, గురువారం మంత్రులందరి సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.

డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కాగా ధరణి రికార్డుల నిర్వహణను విదేశీ సంస్థ నుంచి ఎన్‌ఐసీకి డిసెంబర్ 1 నుంచి అప్పగించామని చెప్పారు. 

రూ.1,035 కోట్ల పనులకు శంకుస్థాపన

జిల్లాకేంద్రంలో జరిగిన యువ వికాసం సభలో రూ.1,025 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.600 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.26 కోట్లతో రామగుండంలో నర్సింగ్ కళాశాల, శాతవాహన అకాడమిక్ బ్లాక్, జిల్లా కేంద్రం లో నూతన ఆర్టీసీ డిపో, నాలుగు పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, పెద్దపల్లి బైపాస్ రోడ్డు తదిత ర పనులకు శంకుస్థాపన చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఒప్పంద పత్రంపై సంత కం చేశారు. అలాగే గ్రూప్ ఇటీవల ఉద్యోగాలు పొందిన సుమారు 9వేల మంది ఉద్యోగాలకు సంబంధించి లాంఛనంగా 15 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఎక్చేంజ్‌మెంట్  తెలంగాణ (డీట్)నుఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టి, జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. 

పొన్నం విజ్ఞప్తికి సీఎం అంగీకారం

శాతవాహన యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎంకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి అంగీకరించడంతో పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

సీఎంకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే విజయరమణారావు 

పెద్దపల్లి, డిసెంబర్ ౪(విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే విజయరమణారావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించి బస్టాండ్ సమీపంలో నాలుగెకరాల 31 గుంటల భూమిని ఆర్టీసీకి కేటాయిస్తూ ప్రభుత్వం పెద్ద కాల్వల నుంచి అప్పన్నపేట వరకు రూ.82 కోట్లతో 4లేన్ల బైపాస్ నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.100 కోట్లతో ఇండియా సమీకృత విద్యాలయాలు నిర్మిస్తామన్నారు.

కిక్కిరిసిన పెద్దపల్లి సీఎం సభకు పోటెత్తిన జనం

పెద్దపల్లి, డిసెంబర్‌౪ (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన యువవికాసం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దాదాపు లక్ష మంది  వరకు హాజరయ్యారు. 4 గంటలకు ముఖ్యమంత్రి సభ ఉండగా మధ్యాహ్నం ఒంటిగంట వరకే జనం సభాప్రాంగణానికి చేరుకున్నారు.

సీఎం  ౨౦ నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓపికగా  వేచిచూశారు. గత బీఆర్‌ఎస్ పాలనపై, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శల వాన కురిపించగా ప్రజలు కరతాళ  ధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. మంత్రి శ్రీధర్‌బాబును సీఎం పొగడ్తలతో ముంచడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మాది చేతల ప్రభుత్వం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 

పెద్దపల్లి సభలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా చరిత్రలోనే బుధవారం అతి భారీ బహిరంగ సభ జరిగిందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన గత బీఆర్‌ఎస్ నేతలు యువకులను మోసం చేశారని మండిపడ్డారు.

తమ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 55 వేల 143 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గతంలో ఉన్న బీఆర్‌ఎస్ మాటల ప్రభుత్వమని తమది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. యువకుల కోసం,  రైతుల కోసం, మహిళల కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. 

పెద్దపల్లికి ఎయిర్‌పోర్ట్ మంజూరు చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సభలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాకు ఎయిర్‌పోర్ట్‌ను మంజూరు చేయాలని, అందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గతంలో కంటే మెరుగ్గా కరీంనగర్ జిల్లా అభివృద్ధి బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. వేములవాడ  ఆలయం మాదిరిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.