13 August, 2026 | 3:43 AM

ప్రభుత్వానికి కాదు.. అన్యాయానికి వ్యతిరేకం

13-08-2026 01:43 AM
  1. నేడు ధర్నా చౌక్‌లో భారీ ధర్నాకు సిద్ధం
  2. జీఓ వచ్చే వరకు పోరాటం ఆగదు ఆగదు -ఆయుష్ హెచ్‌ఎస్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు

జూబ్లీహిల్స్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తమ పోరాటం అన్యాయానికి వ్యతిరేకమని ఆయుష్ హెచ్‌ఎస్ అండ్ పీజీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బి.రాజేశ్ కళ్యాణ్ ప్రకటించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు.బుధవారంతో జేఏసీ నిరవధిక సమ్మె తొమ్మిది రోజులకు చేరుకుంది.ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ అల్లోపతి స్టైఫండ్ కు అనుగుణంగా ఆయుష్ విద్యార్థులు,హౌస్ సర్జన్లు,పోస్ట్గ్రాడ్యుయేట్ లకు స్టైఫండ్ ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వారం రోజులకు పైగా తాము నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే స్టైఫండ్ పెంచుతూ జీఓను జారీ చేయాలన్నారు.జీఓ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.న్యాయమైన డిమాండ్ సాధన కోసం నేడు ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్ లో భారీ ధర్నాను నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేఏసీ నాయకులు,సభ్యులు,విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

స్టైఫండ్ పెంపు సాధించడమే లక్ష్యంగా ప్రజాస్వామ్య,శాంతియుత మార్గాల్లో ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు.ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.