జనగణనలో బీసీల లెక్కలు తేల్చాల్సిందే
- కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో పోరాటం
- ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ప్రొ. కంచ ఐలయ్య
హైదరాబాద్ ఆగస్టు 29 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ జనగణనలో కులగణన చేపట్టాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కల మాదిరిగానే.. బీసీల లెక్కలు కూడా కులాల వారీగా చేపట్టాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం గాంధీ భవనంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీసీసీ బీసీ సెల్ చైర్మన్ వీర్లపళ్లి అధ్యక్షతన బీసీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం చేపట్టే జనగణనలో కులగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మలికార్జున్‌ఖర్గేకు పంపిస్తామని వీహెచ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన తరహాలోని కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీల సంఖ్యను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం బీసీల లెక్కలను పట్టించుకోకపోతే జన గణనను బహిష్కరిస్తామని తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఓబీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ఓబీసీల లెక్కలను తీయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ.. బీసీల లెక్కల కోసం జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెసే కాకుండా మిగతా పార్టీలన్నీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు అనంతుల శామ్మోహన్, మెట్టు సాయికుమార్, కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపత య్యయాదవ్, నాయకులు పాల్గొన్నారు.






