18 March, 2026 | 11:30 PM

కెసిఆర్ పాలనలో వ్యవసాయం స్వర్ణ యుగం

18-03-2026 04:58 PM

* స్వర్ణ యుగానికి మళ్లీ బాటలు వేద్దాం

గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం స్వర్ణయుగాన్ని చూసిందని,ఆ స్వర్ణ యుగానికి మళ్లీ బాటలు వేయాలని కెసిఆర్ బాపుని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, సింగిల్ విండో డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ అన్నారు. పదేళ్ల పాలనలో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు.

మండల కేంద్రమైన గరిడేపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతుబంధు వంటి వినూత్న పథకంతో నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమచేసి రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విస్తరణతో లక్షల ఎకరాలకు నీరందించి,ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, మార్కెట్ సదుపాయాల మెరుగుదల వంటి చర్యలు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రుణమాఫీ,రైతు భరోసా,ఇన్పుట్ సబ్సిడీ హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ పాలనలో రైతన్నలు గౌరవంతో జీవించారని,వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారిందని, ఆ స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.