13 July, 2026 | 3:29 AM

సిరీస్ మన అమ్మాయిలదే

03-05-2024 01:28 AM

మూడో టీ20లో బంగ్లాపై విజయం

సిల్హెట్: మైదానంలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత మహిళల జట్టు.. బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. బౌలర్ల క్రమశిక్షణకు తోడు బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, స్మృతి మంధన మెరుపులు మెరిపించడంతో గురువారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే హర్మన్‌ప్రీత్ బృందం 3 పట్టేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. దిలారా అక్తర్ (27 బంతుల్లో 39, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ నిగర్ సుల్తానా (36 బంతుల్లో 28, 1 ఫోర్) పర్వాలేదనిపించింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్ రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంకలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మన అమ్మాయిలు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేశారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (38 బంతుల్లో 51, 8 ఫోర్లు), స్మృతి మంధన (42 బంతుల్లో 47, 5 ఫోర్లు, ఒక సిక్సర్) జట్టుకు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. లక్ష్యానికి చేరువలో ఈ ఇద్దరు ఔటైనప్పటికి కెప్టెన్ హర్మన్ (6 నాటౌట్), రిచా ఘోష్ (8 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.   ఇరుజట్ల మధ్య నామమాత్రమైన నాలుగో టీ20 ఈ నెల 9న జరగనుంది.