29 April, 2026 | 1:33 PM

నానీల్లో ఒదిగిన ఆకాశమంత అమ్మ

10-06-2024 01:06 AM

అమ్మకు అందరమూ నానీలమే. పేగు బంధాన్ని పంచి మనకు ప్రాణం పోసి, మనసులో మమతానురాగాలను నింపుతుంది. అటువంటి అమ్మను నిలబెట్టి వెన్నెల భావాలను అందరికీ పంచింది ఈ పుస్తకం. ‘అమ్మకు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు’ అన్న దానికి అద్దం పట్టింది వెన్నెల సత్యం ‘అమ్మ నానీలు’ సంపుటి. 

పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచి ప్రయోజకులను చేయాలనే తపన ప్రతీ తల్లి తండ్రికి ఉంటుంది, చివరి దశలో వాళ్ళని చూసుకుంటారని! ఆశ్రమాలకి పంపించాలని కోరుకోకూడదని. ఈ సంస్కారాన్ని వారు తాము పెంచిన బిడ్డలకే వదిలేస్తారు. ‘కని పెంచడం/కన్నోళ్ల బాధ్యత/ఆశ్రమాల్లో తోయడం/ పిల్లల కత’ అని నేటి పరిస్థితి కళ్లకు కడుతుంది. ‘మా వాడు/అమెరికా/ చెడిపోయింది/కుటుంబంలో అమరిక’ అని అమెరికా మోజుతో బంధాలు ఎలా శిథిలమవుతున్నాయో చెప్తారు కవి. అమ్మ ఎంతో ఓపికగా పిల్లలను ప్రేమగా పెంచినా, కొందరు హింసాత్ములుగా మారే వారుండవచ్చు. అమ్మప్రేమను అరణ్యంతో పోల్చుతాడు కవి. నానీల ప్రక్రియలో అమ్మను గురించి రాసి అమ్మ మనలను పెంచే దశలను చూయించారు. మన సంతోషాలు చూసి ఆనంద పడే అమ్మ నీ కళ్ళముందు కనపడేలా చూపారు. మన బాధలను చూసి బాధపడే అమ్మను, బిడ్డల గురించి తల్లి వేసే అడుగుల్ని చూయించారు. తను ఆ స్థితికి చేరేవరకు తెలుసుకోలేని బిడ్డలు ‘అమ్మా’ అనగానే మనలోని కోటి దీపాల మనసు వెలుగుతుందని పాతిక అక్షరాల్లో అనంతమైన అమ్మ ప్రేమను ఒదిగేలా కూర్చిన కవి వెన్నెల సత్యం సదా అభినందనీయులు.

 -కె.ఉషారాణి

అమ్మ నానీలు, రచన: వెన్నెల సత్యం, పేజీలు: 50, ప్రచురణ: వెన్నెల ప్రచురణలు, ప్రతులకు: 

ఇం.నెం. 18 తిరుమల మెగా టౌన్‌షిప్, 

షాద్‌నగర్ 509216, సెల్-: 9440032210)