22 June, 2026 | 7:24 PM

Breaking News

ఒక H1 కల

10-06-2024 01:08 AM

అలా నా కోసమే నడిచి వచ్చి, నా చేయందుకునే 

అందమైన రాకుమారిలాంటి అమ్మాయి లేదు 

యవ్వనకాంక్షా వీణియ పలికే సంగీతాల్లేవు 

జీవన సంరంభపు సందడులసలే లేవు 

ఇపుడీ కలలన్నీ మాయమై పగలూ, రాత్రీ వొకే వొక్క H1 కల

జీవితమంటే వొక భవంతీ, సకల సౌకర్యాలని ఖరారైన చోట 

సౌకర్యవంత జీవితమంటే రూపాయలైన చోట 

డాలరంటే రూపాయిల్ని కొనగలిగే సూపర్‌పవరైన చోట 

H1వీసా అంటే డాలర్ల దేశానికి అనుమతి పత్రమైన చోట 

నాలోనూ నీలోనూ వొకే వొక్క కల... H1 కల!

ఆదర్శాలదేముంది సార్...?

వయసు మళ్లేక వెనకేయాల్సిందంతా వెనకేశాక 

పుట్టిన పిల్లలు ఫారిన్‌లో సెటిలైనాక 

యేం చెప్పినా ఊ కొట్టే వెంగళాయిలకు నేనూ బోధించగలను

పెళ్లిదేముంది మాస్టారూ...?

డాలరు దేశంలోనే పౌరుడినయ్యాక 

అమ్మాయిలనలా వారి తండ్రులు వరుసలో నిలపరా? 

వొక రోజు చూసి, రెండోరోజు ముడేసుకుని 

మూడో రోజు యెగరేసుకుపోవడమే గదా!

అమ్మా నాన్నల్లేరు - రక్త సంబంధాల్లేవు  స్నేహసంబంధాల్లేవు 

గ్లోబల్ విలేజిలో స్వదేశం సెంటిమెంటుకి చోటు లేదు 

మైగాడ్! అసలు మీతో మాట్లాడే తీరిక లేదు

ఈ కోర్సుకి ఫీజెంత? ఆ ప్యాకేజీకి డిమాండెంత?

మొత్తంగా నా బాడీని షాపింగ్ చేసి 

సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యంలో పడదోస్తే కమీషనెంత?

కళలొద్దు - కవిత్వమొద్దు  దేశమూ, ఉద్యమాలసలే వద్దు

మాట్లాడు  కొత్తగా కొన్న నీ కంప్యూటర్ గురించి మాట్లాడు

చేసిన కోర్సుల గురించి మాట్లాడు

వచ్చిన ఆఫర్సు గురించి మాట్లాడు

DAMN WITH POOR INDIA  --LONG LIVE USA

‘కవన గర్బరాలు’ నుంచి