15 July, 2026 | 9:43 PM

మద్యం, డబ్బు ఎన్నికల్లో పనిచేయలేదు!

07-06-2024 02:53 AM

మెదక్‌లో రూ.కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్ గెలవలేదు

కాంగ్రెస్‌తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి

కేంద్ర మంత్రి పదవి నియోజకవర్గానికి దూరమయ్యే అవకాశం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : మెదక్ పార్లమెంట్‌లో వందలాది కోట్లు ఖర్చు చేసినా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయారని, అక్కడ పైసా ఖర్చు చేయకుండా తమ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారని ఇది తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మోదీ ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని భావించే ప్రజలంతా బీజేపీని ఆదరించారని అందుకే తాము చేవెళ్లలో ఘన విజయం సాధించినట్లు  తెలిపారు.

తమ కార్యకర్తలు, నేతల కష్టంతో పాటుగా ఎమ్మార్పీఎస్ మద్దతు సైతం తమ గెలుపునకు ఎంతో ఉపకరించిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయలేదని, పోలీసులు సైతం బాగా పనిచేశారని కితాబునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు తమకు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా తమకే ఓటు వేశారని అందుకే తమకు ఇంతటి విజయం సాధ్యమైందన్నారు.

ఎవరి వల్ల దేశానికి మేలు జరుగుతుందని భావిస్తారో ఓటర్లు వారికే ఓటేస్తారని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కర్మ ఈ ప్రభుత్వం అనుభవిస్తోందని... సర్కారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని సానుభూతిని ప్రకటించారు. రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు, ప్రాజెక్టులు తీసుకువచ్చే ందుకు కృషి చేస్తామని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీపై మైనార్టీల మెద ళ్లలో కాంగ్రెస్ విషం నింపిందని ఆరోపించారు.

తాము భారత్ మాతాకీ జై అంటాం, జై శ్రీరాం అంటాం... కానీ మైనార్టీలను మేం ఎన్నటికీ విమర్శించబోమని... అన్నారు. పార్లమెంట్‌లో 100 శాతం అటెండెన్స్‌తో బెస్ట్ ఎంపీగా పేరుతెచ్చుకుంటానని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పదవి వస్తే నియోజకవర్గానికి దూరం అవ్వాల్సి ఉంటుందని, అది తనకు ఇష్టం లేదన్నారు. కానీ అవకాశం వస్తే తనకున్న జ్ఞానాన్ని దేశాభివృద్ధికి వినియోగిస్తానని పేర్కొన్నారు.