వర్షాల పట్ల అధికారులకు అలర్ట్
అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు సూచించడంతో జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకర పేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు గాయాలపాలు కాగా వారికి తగిన వైద్యసాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని, కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.




