ఆలేరు బంద్ విజయవంతం
ఆలేరు, జూలై 31 : ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం నేడు ఆలేరు పట్టణంలో చేపట్టిన సంపూర్ణ బంద్ విజయవంతమైందని రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బంద్ చేపట్టామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 100 రోజుల్లో డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ప్రకటన చేయలేదని విమర్శించారు.
సబ్ రిజిస్ట్రార్, ఏసీపీ, ఆర్ అండ్ బీ కార్యాలయాలు తరలిపోయాయని, 100 పడకల ఆసుపత్రి, మెడికల్ కాలేజీ కూడా వేరే చోటకు వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పడితే గుండాల, మోటకొండూర్, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల్లోని 98 గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని, 23 ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






