1 August, 2026 | 1:07 AM

ప్రజాపోరాటాల స్ఫూర్తిప్రదాత కామ్రేడ్ పూనెం లింగన్న

01-08-2026 12:00 AM

సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాల నాయకులు

సూర్యాపేట రూరల్, జూలై 31: నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంగా, పేద ప్రజలు, ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడి ప్రాణత్యాగం చేసిన ప్రతిఘటన పోరాట యోధుడు, కామ్రేడ్ పూనెం లింగన్న చిరస్మరణీయుడని పలు ప్రజాసంఘాల నాయకులు కొనియాడారు. లింగన్న ఏడవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య మాట్లాడుతూ, 1997లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళంలో చేరి దళ కమాండర్గా, రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన లింగన్న దళంపై 300 మందికి పైగా పోలీసులు కాల్పులు జరిపి, ఆయనను పట్టుకొని తీవ్ర చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో విప్లవకారులను కాల్చిచంపడం ప్రభుత్వాల దుర్మార్గమైన చర్య అని, ప్రశ్నించే వారిని ఎంతమందిని చంపినా మరికొందరు లింగన్నలు పుట్టుకొస్తారని హెచ్చరిస్తూ, ఆయన కలలు కన్న సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి మధు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి, పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి, డివిజన్ ప్రధాన కార్యదర్శి దండి ప్రవీణ్, ఐఎఫ్టీయూ నాయకుడు దుర్గయ్య పాల్గొన్నారు.